NTV Telugu Site icon

Bullet Train Project: మోడీ కలల ప్రాజెక్ట్ “బుల్లెట్ రైలు”కు.. జపాన్ అడ్డంకి!

India Japan

India Japan

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుకు చిక్కులు తప్పేలా కనిపిస్తున్నాయి. ముంబై – అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి జపాన్, భారతదేశంలో చాలా విషయాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. “ది హిందూ”లో వచ్చిన కథనం ప్రకారం.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని అధికారుల బృందం ఇటీవల జపాన్‌కు మూడు రోజుల పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ తన కంపెనీల నుంచి రైలు సెట్లు, సిగ్నలింగ్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కోరుతోంది. అలాగే.. ప్రాజెక్టు వ్యయం, పూర్తి చేసే సమయానికి సంబంధించి ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేదని సమాచారం. 2027లో ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

జపాన్‌కు అధికారుల పరుగులు..
రైల్వే బోర్డు సభ్యుడు అనిల్ కుమార్ ఖండేల్వాల్, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వివేక్ కుమార్ గుప్తా కూడా వైష్ణవ్‌తో పాటు జపాన్ వెళ్లారు. వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ కూడా ఈ ఏడాది చివర్లో టోక్యోలో పర్యటించనున్నారు. 508 కిలోమీటర్ల పొడవునా బుల్లెట్ ప్రాజెక్టు కోసం గుజరాత్, మహారాష్ట్రల్లో భూసేకరణ పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 215 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ.. భారతదేశం, జపాన్ మధ్య రోలింగ్ స్టాక్ అంటే రైలు సెట్లు, సిగ్నల్ సిస్టమ్‌లను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చుకు సంబంధించి చర్యలు మందగించాయని సమాచారం.

ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..
ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ అన్ని రకాల సాంకేతిక మద్దతు, సాంకేతికతను అందిస్తోంది. అయితే దాని షరతు ఏమిటంటే సిగ్నలింగ్ సిస్టమ్, రైలు సెట్‌లను జపాన్ కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ యొక్క రుణ నిబంధనల ప్రకారం.. కవాసకి, హిటాచీ వంటి జపాన్ కంపెనీలు మాత్రమే ఈ టెండర్లు వేసేందుకు అవకాశం ఉంది. పెరుగుతున్న ప్రాజెక్ట్ వ్యయంపై ఏకాభిప్రాయం లేదు. దీని కోసం మొత్తం బడ్జెట్ రూ.1.08 లక్షల కోట్లు కాగా అందులో ఇప్పటికే రూ.60,372 కోట్లు ఖర్చు చేశారు.

వ్యయం పెరిగే అవకాశం..
ఇందులో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చించారు. ఇది రైలు సెట్‌లను కొనుగోలు చేయడానికి, సిగ్నలింగ్ సిస్టమ్‌ల ఇన్‌స్టాలేషన్‌కు ఖర్చులు పెరగనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. షింకన్‌సెన్ టెక్నాలజీపై ఆధారపడిన జపాన్ రైలు సరిగ్గా 60 సంవత్సరాల క్రితం అక్టోబర్ 1, 1964న ప్రారంభించబడింది. ఇది ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు దాదాపు మూడు గంటల్లో దూరాన్ని చేరుతుందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో… సూరత్- బిలిమోరా మధ్య బుల్లెట్ రైలు 2026లో ప్రారంభమవుతుందని వైష్ణవ్ పేర్కొన్నారు. అయితే ఈ గడువు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Show comments