Site icon NTV Telugu

Amazon Layoffs 2025: షాకింగ్ న్యూస్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు.. ఏకంగా 30 వేలు..!

Amazon

Amazon

Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15.5 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం వ్యాపార విస్తరణతో పెరిగిన ఖర్చులను తగ్గించుకోవడమే ఈ లేఆఫ్స్ వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

READ MORE: Central Cabinet Decisions: బీహార్ ఎన్నికల వేళ అన్నదాతలకు కేంద్రం శుభవార్త

గత రెండేళ్లుగా అమెజాన్ పరికరాలు, కమ్యూనికేషన్లు, పాడ్‌కాస్టింగ్, ఇతర చిన్న విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం మానవ వనరులు, డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ వంటి విభాగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. హెచ్ఆర్ విభాగంలోనే దాదాపు 15 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన నోటీసులు వచ్చే వారం నుంచి ఈమెయిల్ ద్వారా పంపనున్నారు. దీనికి సంబంధించి ప్రభావితమయ్యే విభాగాల మేనేజర్లకు అమెజాన్ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిందని సమాచారం. ప్రధాన కార్యాలయం ఉన్న మిన్నియాపాలిస్‌లో ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

READ MORE: Cyclone Montha: పెను తుఫాన్‌గా మారిన మొంథా..

అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ, సంస్థలో అధిక బ్యూరోక్రసీని తగ్గించడమే కాకుండా నిర్వహణ స్థాయిలను కుదించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. సంస్థలోని పునరావృత పనులను ఆటోమేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. జూన్‌లో జాస్సీ మాట్లాడుతూ.. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

2022 చివరిలో అమెజాన్ సుమారు 27,000 మందిని తొలగించింది. అప్పటి నుంచి లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈసారి 30,000 మందిని తొలగించడం ద్వారా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్‌గా నిలవనుంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 216 కంపెనీలు దాదాపు 98,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2024లో ఈ సంఖ్య 1.53 లక్షలకు చేరింది. అమెజాన్‌తో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అమెజాన్ ఆర్థిక వ్యూహం నిరంతరం మారుతున్న నేపథ్యంలో, చివరి దశలో తొలగించే ఉద్యోగుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశముందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

Exit mobile version