Kantar BrandZ 2026: భారత కార్పొరేట్ ప్రపంచంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అగ్రస్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి, టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కాంతార్ విడుదల చేసిన 2026 ‘బ్రాండ్‌జెడ్’ ర్యాంకింగ్స్‌లో ఈ రికార్డు నమోదైంది. అయితే ఎయిర్‌టెల్ అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఈ జాబితాలో, దాని ప్రధాన పోటీదారు రిలయన్స్ జియో పేరు ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
2014లో కాంతార్ ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి టాప్ ర్యాంక్ సాధించిన మొట్టమొదటి టెలికాం కంపెనీగా ఎయిర్‌టెల్ చరిత్ర సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ 5 శాతం పెరిగి 43.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మరి టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీనిస్తున్న జియో ఈ ర్యాంకింగ్స్‌లో ఎందుకు లేదనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీనికి వెనుక ఒక కీలక సాంకేతిక కారణం ఉంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకముందే జియో వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయిపోవడంతో, ఈ జాబితాలో జియోను పరిగణనలోకి తీసుకోలేదు.
2020 తర్వాత ఎయిర్‌టెల్ బ్రాండ్ విలువ ఏకంగా 210 శాతం వృద్ధి చెందడం విశేషం. కేవలం మొబైల్ కనెక్టివిటీ సేవలకే పరిమితం కాకుండా, డిజిటల్ సర్వీసెస్ రంగంలోకి వేగంగా విస్తరించడమే ఎయిర్‌టెల్‌ను దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలబెట్టింది. ఇక ఈ జాబితాలో 35.6 బిలియన్ డాలర్ల విలువతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెండో స్థానానికి పడిపోగా, 24.1 బిలియన్ డాలర్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మూడో స్థానంలో నిలిచింది. గ్లోబల్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న మూడు భారతీయ బ్రాండ్లు ఇవే కావడం గమనార్హం.
ఓవైపు గ్లోబల్ బ్రాండ్ల విలువ 22 శాతం మేర పెరిగినప్పటికీ, భారత్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. గత ఏడాది కాలంలో దేశంలోని టాప్ 100 బ్రాండ్ల మొత్తం విలువ 12 శాతం తగ్గి 460.3 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఆటోమొబైల్, రిటైల్ రంగాలు పుంజుకున్నప్పటికీ, టెక్నాలజీ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో వచ్చిన కుదుపు ఈ నష్టానికి కారణమైంది. ఈ ప్రతికూల వాతావరణంలోనూ ఈ-కామర్స్ సంస్థ మీషో 64 శాతం వృద్ధితో (1.9 బిలియన్ డాలర్లు) అత్యంత వేగంగా ఎదుగుతున్న బ్రాండ్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 60 శాతం వృద్ధితో (3.8 బిలియన్ డాలర్లు) సత్తా చాటింది.
క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ 4.3 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 27వ స్థానాన్ని దక్కించుకుని ఈ జాబితాలోకి కొత్తగా అడుగుపెట్టింది. భారత మార్కెట్లో ద్రవ్యోల్బణం ప్రభావం కొనుగోలుదారుల నిర్ణయాలపై స్పష్టంగా కనిపిస్తోందని కాంతార్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై అన్ని కంపెనీలకు వృద్ధి అనేది గ్యారెంటీ కాదని, వినియోగదారులకు ప్రత్యేకమైన విలువను అందించే బలమైన బ్రాండ్లు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకుంటాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

