శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్‌కు సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త పరిపాలన తెలిపింది. అంతకుముందు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా అదానీ గ్రూప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిసానాయకే బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అదానీకి చెందిన ఈ ప్రాజెక్ట్‌లో మార్పులు చేస్తుందని సూచించింది.
గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
గత శ్రీలంక ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కొత్త ప్రభుత్వం ప్రస్తుతం రెడ్ సిగ్నల్ చూపించింది. అటువంటి పరిస్థితిలో, అదానీ యొక్క ఈ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది. ఈ ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయనుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదాన్ని కొత్త ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని శ్రీలంక అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఓ జాతీయ వార్తా పత్రిక వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 7న కొత్త మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పునరాలోచనపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అదానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న ఈ తరుణంలో శ్రీలంక కొత్త నిర్ణయం అదానీకి అడ్డంకిగా మారవచ్చు.
- శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ ప్రకారం.. ప్రాజెక్ట్ దాని ధర నిర్మాణానికి సంబంధించి సమస్యలను ఎదుర్కొంది. కేబినెట్ సమావేశం అనంతరం హెరాత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం ఆమోదించిన విద్యుత్ ఛార్జీల విషయంలో కొంత సమస్య ఉందన్నారు. ఇది చాలా ఎక్కువని తెలిపారు. నవంబర్ 14న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం తాజాగా పరిశీలన జరుపుతుందని చెప్పారు. - అదానీ ఒప్పందం ముప్పు..
గత నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా శ్రీలంక ఇంధన సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తామని దిసానాయకే ప్రతిజ్ఞ చేశారు. అదానీ ఒప్పందాన్ని సంభావ్య ముప్పుగా ఆయన అభివర్ణించారు. ఒప్పందంలోని నిబంధనలపై మళ్లీ చర్చలు జరపాలని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకోవడమే మంచిదని కూడా చెప్పాడు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.