NTV Telugu Site icon

Edible Oil Prices: సామాన్యులకు ఊరట.. తగ్గిన వంట నూనెల ధరలు

Edible Oil Prices

Edible Oil Prices

Adani Wilmar cuts prices of edible oil: నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ప్రముఖ ఆయిల్ ఫార్చూన్ బ్రాండ్ కంపెనీ అదానీ విల్మర్ గుడ్‌న్యూస్‌ అందించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో ఫార్చూన్ బ్రాండ్‌పై విక్రయించే వంట నూనెల ధరలను రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెల ధరలు దిగి రానున్నాయి. ఫార్చూన్ సోయా బీన్ ఆయిల్ రూ.195 నుంచి రూ.165కు తగ్గనుంది. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.210 నుంచి రూ.199కి, ఆవ నూనె గరిష్ఠ ధర రూ.195 నుంచి రూ.190కి తగ్గుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ రూ.225 నుంచి రూ.210కి తగ్గుతుంది. వేరుశనగ నూనె రూ.220 నుంచి రూ.210కి, రాగ్ బ్రాండ్‌పై విక్రయించే వనస్పతి రూ.200 నుంచి రూ.185కి చేరనుంది. రాగ్ పామోలిన్ రూ.170 నుంచి రూ.144కి తగ్గనుంది.

Read Also: Gold Coins: బాత్రూమ్ కోసం తవ్వితే.. గోల్డ్ కాయిన్స్ బయటపడ్డాయి

కాగా వంట నూనెల ధరలు తగ్గించడంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు దిగిరావడంతో దేశంలోనూ ధరలు తగ్గించాలని సదరు ఆయిల్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దిగుమతి చేసుకున్న వంటనూనెల గరిష్ట రిటైల్ ధరను వారంలోగా లీటరుకు పది రూపాయల వరకు తగ్గించాలని ప్రభుత్వం వంట నూనెల ఆయిల్ తయారీదారులను ఆదేశించింది. దీంతో పలు కంపెనీలు వంట నూనెల ధరలను తగ్గిస్తున్నాయి. తగ్గిన వంటనూనెల ధరలు త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని అదానీ విల్మర్ కంపెనీ సీఈవో అంగ్షు మల్లిక్ తెలిపారు. రాబోయే పండగ సీజన్‌లో డిమాండ్ పెరుగుదలకు ఈ తగ్గింపు ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా విదేశాల్లో నూనె గింజల రేట్లు భారీగా పతనమవుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం కూడా తగ్గించడంతో ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి.