Site icon NTV Telugu

రిలయన్స్‌ ఏజీఎం.. ఎన్నో సంచలనాలు..!

Mukesh Ambani

Mukesh Ambani

సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయాన్‌ రిలయన్స్‌ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్‌ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ఈ ప్రకటన చేశారు. బోర్డులోకి ఆరామ్‌ కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయాన్‌ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేరిక రిలయన్స్‌ ప్రపంచీకరణలో మొదటి అడుగుగా భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా కల్లోలంలోనూ రిలయన్స్‌ గతేడాది అద్భుతమైన ప్రదర్శన కనబర్చినట్లు చెప్పారు ముఖేష్‌ అంబానీ. కంపెనీ సమీకృత ఆదాయం 54 వేల కోట్ల రూపాయలకు చేరినట్లు తెలిపారు. వీటిల్లో 50 శాతం కన్జ్యూమర్‌ వ్యాపారం నుంచే లభించిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో 6.8 శాతం వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అందించినట్లు చెప్పారు. 75 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇకపై పునరుత్పాదక శక్తిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్‌ సంస్థ ప్రకటించింది. ఇందుకోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రిలయన్స్‌-గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్స్ట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు ముఖేష్‌ అంబానీ. ఈ ఫోన్‌ గణేష్‌ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్‌ 10 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్‌. జియోఫోన్‌ నెక్స్ట్ భవిష్యత్తులో భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందన్నారు. ఇక కోవిడ్‌పై పోరులో రిలయన్స్‌ తన వంతు కార్యాచరణ ప్రకటించింది. ఇందుకోసం ఐదు మిషన్స్‌ ప్రారంభించినట్లు నీతా అంబానీ తెలిపారు. మిషన్‌ ఆక్సిజన్‌, మిషన్‌ కోవిడ్‌ ఇన్‌ఫ్రా, మిషన్‌ అన్నసేవ, మిషన్‌ ఎంప్లాయికేర్‌, మిషన్‌ వ్యాక్సిన్‌ సురక్ష మొదలుపెట్టినట్లు చెప్పారు.

Exit mobile version