బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం నటి ప్రియా ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దర్ని నాగార్జున శనివారమే సేవ్ చేశారు. మిగిలిన ఆరుగురిలో ఒక్కో స్టేజ్ లో ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. అలా ఆదివారం మొదట లోబో, ఆ తర్వాత రవి, ఆపైన సిరి, చివరగా జెస్సీ సేవ్ అయ్యారు. చివరకు మిగిలిన యానీ, ప్రియా లను నాగార్జున చాలా చిత్రంగా బయటకు పంపాడు. గార్డెన్ ఏరియాలోని రెండు చెక్క పెట్టెల్లోకి ఇద్దరినీ పంపి, ఎవరు అందులో మిస్ అయితే వారు ఎలిమినేట్ అయిపోయినట్టేనని చెప్పాడు. తీరా కొంత సేపటికి బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ ఆ తలుపులు తీసే సరికీ రెండూ ఖాళీగా ఉండటంతో అంతా అవాక్కయ్యారు. బిగ్ బాస్ ఈ వారం ఇద్దరిని నామినేట్ చేసి ఉంటాడా? అని కొందరు కంగారు పడగా, అలాంటిదేమీ జరగదు ఎవరో ఒకరు తిరిగి వస్తారని మిగిలిన వాళ్ళు హోప్ తో ఉన్నారు. చివరకు యానీ మాస్టర్ వేరే డోర్ నుండి బిగ్ బాస్ మెయిన్ హాల్ లోకి రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రియా ఎలిమినేట్ కావడాన్ని ప్రియాంక, మానస్ మాత్రం జీర్ణించుకోలేకపోయారు.
ఇక ఎలిమినేషన్ అయిన ప్రియా బిగ్ బాస్ వేదికపై చాలా హుందాగా, గంభీరంగా ఉండటం విశేషం. నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోని వ్యక్తులకు మార్కులు వేయమని చెప్పినప్పుడు కూడా ప్రియా తన మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ 10కి గానూ లోబోకు 5, విశ్వకు 5, రవికి 7, షణ్ముఖ్ కు 8.5, సిరికి 8.5, శ్రీరామ్ కు 8, జెస్సీకి 8, కాజల్ కు 7, సన్నీకి 9 మార్కులు వేసింది. ప్రియాంక, యానీ మాస్టర్, మానస్ కు 10కి 10 మార్కులు వేయడం విశేషం. ప్రియా ఎలిమినేట్ కావడాన్ని తట్టుకోలేక ప్రియాంక కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, ఓదార్చిన ప్రియా, ‘బయటకు వచ్చిన తర్వాత గాసిప్ గ్యాంగ్ లో మనం కూడా చేరదాం, డోంట్ వర్రీ ప్రియాంక’ అంటూ ఓదార్చింది. ప్రియా తనను ఎంతో మోటివేట్ చేసిందని యానీ మాస్టర్ చెబుతూ, ప్రియా గాసిప్ గ్యాంగ్ లో తానూ చేరతానని తెలిపింది. మొత్తానికి ప్రియా ఎలిమినేషన్ కూల్ గానే సాగింది. ఆ తర్వాత ప్రియాంకను మానస్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత కాసేపటికి లోబో కన్ ఫెషన్ రూమ్ లో రవి గురించి చేసిన వ్యాఖ్యలు వారి మధ్య వివాదానికి దారి తీశాయి. వరెస్ట్ పెర్ఫామెన్స్ తో జైలుకు వెళ్ళిన విశ్వ దగ్గర లోబో ముందే రవి వాపోయాడు. అవసరానికి రవి తనను వాడుకుంటాడని లోబో చెప్పిన మాటలను రవి జీర్ణించుకోలేకపోయాడు. లోబో మాటలను తనను బాగా హర్ట్ చేశాయని, ఈ రెండు మూడేళ్ళలో తనను ఎంతో బాధకు గురించిన మాటలు ఇవనేని రవి అన్నాడు. మరి లోబో అభిప్రాయాలపై సోమవారం ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి.