Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆలయ నిర్వహాకులు శుభవార్త తెలిపారు. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ కొండపైనున్న విష్ణు పుష్కరిణిలో భక్తులకు సంకల్ప స్నానం ఆచరించే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రావణ మాసం మొదటి ఆదివారం యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అధికారులు విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించారు. ఆలయ అధికారులు అఖండ దీపం వెలిగించి, జ్యోతి ప్రజ్వలన చేసి సంకల్పాన్ని ప్రారంభించారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించినప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా కొండపై ఉన్న పుష్కరిణిలో స్నానాలు చేయడం నిషేధించారు. అప్పటి నుంచి కొండ కింద ఏర్పాటు చేసిన లక్ష్మీ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. కొండ కింద స్నానాలు చేసేందుకు భక్తులు ఇబ్బంది పడుతుండటంతో విష్ణు పుష్కరిణిని మళ్లీ ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
Read also: CM Revanth Reddy: అంతర్జాతీయ యువజన దినోత్సవం.. రాష్ట్ర యువతకు సీఎం శుభాకాంక్షలు
ఇందులో భాగంగా కొండపై స్నాన సంకల్పాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ స్నాన సంకల్ప సౌకర్యాన్ని భక్తులు రూ.500 టికెట్ తీసుకోవాలి. ఈ టిక్కెట్టు తీసుకునే వారికి.. స్నానమాచరించడమే కాకుండా.. స్వామివారి ప్రత్యేక దర్శన సౌకర్యం, లడ్డూ ఉచితంగా అందజేయనున్నారు. టిక్కెట్లు లేని భక్తులు పుష్కరిణిలో తలపై నీళ్లు చల్లుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. మరోవైపు శ్రావణ మాసం మొదటి ఆదివారంతో పాటు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కొండ ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంతోపాటు స్వామివారి ప్రధాన ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
MLC Kavitha: కవితకు నో బెయిల్.. విచారణ ఆగస్టు 20 కి వాయిదా..