Maha Shivaratri: నేడు మహాశివరాత్రి.. తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తును ఆలయాలకు వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. శైవ నినాదాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. అయితే.. శివరాత్రి విశిష్టత గురించి ఎంత మందికి తెలుసు? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? జాగారం ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం.. పూరానాల ప్రకారం.. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం(కాలకూట విషం) పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛపోయాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.
READ MORE: PM Modi: బంగ్లా నుంచి ప్రధాని మోడీకి ఆహ్వానం.. వెళ్లే అవకాశాలు తక్కువే..
అంతే కాదు.. మహా శివరాత్రి అనేది భక్తి, నియమం, పవిత్రతకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున శివారాధన చేసే ప్రతి భక్తుడు కొన్ని ఆచారాలను తప్పక గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా శివలింగానికి సమర్పించకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి కేతకి పువ్వులు. ఈ పువ్వులు శివపూజలో నిషిద్ధం. పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడి అబద్ధానికి సాక్ష్యంగా నిలిచినందుకు పరమేశ్వరుడు కేతకిని శపించాడని చెబుతారు. అలాగే తులసి దళాలు విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి శివార్చనలో వాడరాదు. కుంకుమ పార్వతీదేవికి చిహ్నం. అందువల్ల కుంకుమను శివపూజలో ఉపయోగించరు. శంఖంతో నీటిని తీసి అభిషేకం చేయడం కూడా శాస్త్రవిరుద్ధం, ఎందుకంటే శంఖం విష్ణువుకు సూచకం. అక్షతల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. విరగని అక్షతలు మాత్రమే సమర్పించాలి, పగిలిన లేదా విరిగిన వాటిని ఉపయోగించకూడదు. శివారాధనలో భక్తి ఎంత ముఖ్యమో, నియమపాలన కూడా అంతే ప్రధానమని పండితులు చెబుతున్నారు. సరైన విధంగా పూజిస్తే శివకృప లభించి… జీవితం శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో నిండుతుందని భక్తుల విశ్వాసం. నియమాలు పాటిస్తూ శివయ్యను స్మరించుకోండి..
READ MORE: Advocate Swapna Murder Case: పక్కా స్కెచ్‌తో చెల్లిని అంతమొందించిన అన్న!
