Upcoming Cars: సెప్టెంబర్ నెలలో ఇండియన్ కార్ మార్కెట్ లోకి సరికొత్త కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో అత్యధికం అమ్ముడవుతున్న టాటా నెక్సాన్ తన న్యూ అవతార్ లో ‘నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023’గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు హోండా ఎలివేట్ రంగంలోకి దిగుతోంది. భారత కార్ మార్కెట్ లో హోండా తన మార్క్ చాటుకోవాలని చూస్తుంది. తన తొలి ఎస్‌యూవీని సెప్టెంబర్ లోనే లాంచ్ చేస్తోంది. పండగ సీజన్ సమీపిస్తున్న సమయంలో కార్ మేకర్లు కూడా తమ కొత్త కార్ల ద్వారా వినియోగదారులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
హోండా ఎలివేట్:
జపాన్ కార్ మేకర్ దిగ్గజం హోండా దేశంలో తన తొలి ఎస్‌యూవీ కార్ ని లాంచ్ చేయబోతోంది. భారతదేశంలో ఎస్‌యూవీ కార్ సేల్స్ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని క్యాప్చర్ చేసేందుకు హోండా ఎలివేట్ ను తీసుకువస్తోంది. ఇప్పటికే స్టన్నింగ్స్ లుక్స్, సూపర్ ఇంటీయర్స్ తో ఎలివేట్ అదరగొడుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ క్రేటా, మారుతి గ్రాంగ్ విటారా, కియా సెల్టోస్, ఎంజీ ఆస్టర్ కార్లకు ఎలివేట్ నేరుగా కాంపిటీషన్ ఇవ్వనుంది. అడాస్ ఫీచర్లతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లో ఎలివేట్ రాబోతోంది. ధర రూ.11 లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్:
ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఏదైనా ఉందంటే అది టాటా నెక్సాన్. ఇప్పుడు నెక్సాన్ మరింత స్టైలిష్ గా ‘నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023’ రూపంలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది కూడా సెప్టెంబర్ నెలలోనే మార్కెట్ లోకి రానుంది. గతంలో పోలిస్తే చాలా మార్పులు కొత్త నెక్సాన్ లో కనిపించబోతున్నాయి. ఇంజన్ పరంగా పెద్దగా మార్పులు లేకున్నా, కాస్మోటిక్ ఛేంజెస్, ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతోంది. 10 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో రానుంది. ఏసీ వెంట్ మార్పులు కనిపిస్తాయి.
దీంతో పాటు నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే రాబోతోంది. ఇండియాలో నెక్సాన్ ఈవీ కార్ మోస్ట్ సెల్లింగ్ కార్ గా ఉంది. ఇప్పటికే నెక్సాన్ ఈవీ ప్రైమ్, ఈవీ మాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మహీంద్రా 400కి పోటీ ఇస్తోంది.
టయోటా రూమియన్:
ఈ రెండు కార్లు కాకుండా టయోటా రూమియన్ 7 సీటర్ కార్ త్వరలో లాంచ్ కాబోతోంది. ఇది మారుతి ఎర్టిగా రీ బ్యాడ్జ్ వెర్షన్ గా వస్తోంది. ఎంపీవీ కార్ సెగ్మెంట్ లో ఎర్టిగా సూపర్ సక్సెస్ అయింది. దీనిని పోలిన విధంగా రూమియన్ కార్ రిలీజ్ కానుంది.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్:
ప్రెంచ్ వాహన తయారీదారు సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ కారు రిలీజ్ చేస్తుంది. ఇది ఈ కంపెనీ నుంచి వస్తున్న నాలుగో మోడల్. ఇది హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రయిజర్, హోండా ఎలివేట్ కార్లకు పోటీగా ఉంది. ఈ ఎస్‌యూవీ 5 సీటర్, 7 సీటర్ గా రెండు వెర్షన్లలో రాబోతోంది.