ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూ వీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను విడుదల చేసింది. పేరుకు తగ్గట్టుగా కింగ్ సైజ్ ఫీచర్లతో అదరగొడుతోంది. అద్భుతమైన రేంజ్, స్పీడుతో వస్తుంది. ధర కూడా తక్కువే. ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ.2.95 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది సింగిల్ ఛార్జ్ తో 179 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోకు 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ అందించబడుతుంది. TVS King EV Max అధిక పనితీరు గల 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. TVS King EV Max ఎకో మోడ్‌లో 40 kmph వరకు, సిటీ మోడ్‌లో 50 kmph వరకు, పవర్ మోడ్‌లో 60 kmph వరకు వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ కేవలం 3 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఈ ఎలక్ట్రిక్ ఆటోలో అనేక సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, TVS స్మార్ట్‌కనెక్ట్ ద్వారా టెలిమాటిక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, 31% గ్రేడబిలిటీ, 500mm వరకు వాటర్ వాడింగ్ సామర్థ్యం, విశాలమైన క్యాబిన్, ఎర్గోనామిక్ సీటింగ్ డిజైన్‌తో వస్తుంది. TVS SmartXonnect, King EV MAX వంటి స్మార్ట్ ఫీచర్లను స్మార్ట్ఫోన్తో అనుసంధానం చేయవచ్చు. మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఆటో నడుపుతూ సంగీతం వినవచ్చు. చిన్న డిస్ప్లేలో మ్యాప్ కూడా చూడవచ్చు. రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వంటి ఫీచర్లు అందించారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.