Top Selling Motorcycles: అక్టోబర్ 2025 నెలలో ద్విచక్ర వాహనాల మార్కెట్ పండుగ సీజన్ ఉత్సాహం, కొత్త GST నియమాల ప్రభావంతో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అయితే మొత్తం అమ్మకాల పరంగా చూస్తే.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే కాస్త తగ్గుదల నమోదు అయింది. ఈసారి టాప్ 10 మోటార్‌సైకిళ్లు కలిపి 10,60,399 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2024 అక్టోబర్‌లో నమోదైన 10,81,437 యూనిట్లతో పోలిస్తే దాదాపు 2% తగ్గుదల. మరి ఏ బైకులు అత్యధికంగా అమ్ముడయయ్యో చూసేద్దామా..
100W ఛార్జింగ్, OLED డిస్ప్లేలు, Bose స్పీకర్లతో Poco F8 సిరీస్ గ్లోబల్ లాంచ్..!
దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా హీరో స్ప్లెండర్ (Hero Splendor) మళ్లీ మొదటి స్థానాన్ని సాధించింది. అక్టోబర్ 2025లో ఈ బైక్ 3,40,131 యూనిట్లు విక్రయించబడగా.. ఇది గతేడాది అక్టోబర్‌లో విక్రయించిన 3,91,612 యూనిట్లతో పోలిస్తే 51,481 యూనిట్ల తగ్గుదల (-13.15%) నమోదయ్యింది. ఇక రెండో స్థానంలో హోండా కంపెనీకి చెందిన హోండా షైన్ (Honda Shine) నిలిచింది. ఈ బైక్ అక్టోబర్ 2025లో 1,74,615 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇవి 2024లో నమోదైన 1,96,288 యూనిట్లతో పోలిస్తే 21,673 యూనిట్ల తగ్గుదల (-11.04%) కనిపించింది.
మూడో స్థానాన్ని ఈసారి భారీ వృద్ధితో బజాజ్ పల్సర్ (Bajaj Pulsar) లైనప్ దక్కించుకుంది. పల్సర్ అక్టోబర్ 2025లో 1,52,996 యూనిట్లు విక్రయించగా, ఇవి 2024 అక్టోబర్‌లోని 1,11,834 యూనిట్లతో పోలిస్తే 41,162 యూనిట్ల పెరుగుదల (+36.81%) నమోదు చేశాయి. ఇక నాలుగో స్థానం హీరో HF డీలక్స్ (Hero HF Deluxe) దక్కించుకుంది. ఈ మోడల్ అక్టోబర్ 2025లో 1,13,998 యూనిట్లు అమ్ముడవగా, ఇవి 2024లో నమోదైన 1,24,343 యూనిట్లతో పోలిస్తే 10,345 యూనిట్లు (-8.32%) తగ్గాయి. ఇక ఐదో స్థానంలో టీవీఎస్ అపాచీ (TVS Apache) ఉంది. అపాచీ అక్టోబర్ 2025లో 61,619 యూనిట్లు నమోదు చేయగా.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 11,522 యూనిట్లు పెరగడం (+23%) గమనార్హం.
వీటి తర్వాతి స్థానాలలో టీవీఎస్ రైడర్ (TVS Raider) అక్టోబర్ 2025లో 56,085 యూనిట్ల విక్రయాలతో (+9.64%) వృద్ధి నమోదు చేసింది. ఇక ఏడో స్థానంలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) నిలిచింది. ఇది 52,734 యూనిట్లు అమ్ముడవగా, గతేడాది అక్టోబర్‌లోని 61,689 యూనిట్లతో పోలిస్తే 8,955 యూనిట్ల తగ్గుదల (-14.52%) కనిపించింది. అలాగే ఎనిమిదో స్థానం రాయల్ ఎంఫిల్డ్ క్లాసిక్ 350 దక్కించుకుంది. ఈ బైక్ అక్టోబర్ 2025లో 46,573 యూనిట్లు విక్రయించి, గతేడాది కంటే 8,276 యూనిట్లు (+21.61%) ఎక్కువగా అమ్ముడైంది. ఇక తొమ్మిదో స్థానాన్ని హోండా సీబీ యునికార్న్ (Honda CB Unicorn) సాధించింది. ఈ బైక్ 32,825 యూనిట్లు అమ్ముడవగా, ఇది 2024 అక్టోబర్‌తో పోలిస్తే స్వల్పంగా 1,057 యూనిట్లు పెరిగింద. ఇక చివరగా హీరో గ్లామర్ (Hero Glamour) పదో స్థానంలో నిలిచింది. ఈ బైక్ అక్టోబర్ 2025లో 28,823 యూనిట్లు విక్రయించి, గతేడాది కంటే 4,467 యూనిట్ల పెరుగుదల (+18.34%) సాధించింది.