NTV Telugu Site icon

Tesla: టెస్లాకి అంత ఈజీ కాదు.. టాటా, మహీంద్రాలను తట్టుకుంటుందా..?

Tesla Vs Tata

Tesla Vs Tata

Tesla: ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వచ్చే వారం ఎలాన్ మస్క్ ఇండియాను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ కానున్నారు. టెస్లా కార్లను దేశంలోనే తయారు చేసేందుకు ఏకంగా 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది టెస్లా. గతంలో టెస్లా కార్ల దిగుమతిపై భారీగా సుంకాలను విధించిన భారత ప్రభుత్వం, ఇటీవల తీసుకువచ్చిన విధానంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి, మూడేళ్లలో ప్లాంట్ ఓపెన్ చేస్తే, దిగుమతి సుంకాలను తగ్గిస్తామని చెప్పింది. దీంతో టెస్లా కార్లు త్వరలోనే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే జర్మనీలోని టెస్లా కర్మాగారంలో భారత్‌లో వినియోగించేందుకు రైట్ హ్యాండ్ డ్రైవ్(RHD) కార్ల తయారీ మొదలైంది.

Read Also: DD News: రంగు మారిన డీడీ న్యూస్‌ చిహ్నం.. ప్రసార భారతి కాదు ప్రచార భారతి అంటూ..

టాటాని తట్టుకుంటుందా..?

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఉన్న భారత్‌పై అన్ని వాహన కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. మరోవైపు వేగంగా ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లుతోంది. 2030 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరగాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే, టెస్లా భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. దేశీయ కార్ మేకర్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాను తట్టుకుని నిలబడాలి.

ఇప్పటికే దేశీయ ఈవీ కార్ మార్కెట్‌లో టాటాకు తిరుగు లేకుండా ఉంది. భారతదేశ రోడ్లపై తిరుగుతున్న ఈవీ కార్లలో 70 శాతం వాటాను టాటా ఆక్రమించింది. టాటా నుంచి నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో టాప్‌గా ఉంది. దీంతో పాటు టియాగో, టిగోర్ ఈవీ వెర్షన్లు ఉన్నాయి. ఇటీవల పంచ్ ఈవీని కూడా ఇంట్రడ్యూస్ చేసింది.

అయితే, భారత వినియోగదారుడికి తగ్గట్లుగా టాటా ఈవీ కార్ల రేట్లు అందరికి అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 10 నుంచి రూ. 20 లక్షల లోపే ఈ కార్లు లభిస్తున్నాయి. ఇక టెస్లా విషయానికి వస్తే దాని లోయెస్ట్ మోడల్ ‘మోడల్ 3’ ధర ఇండియాలో రూ. 39 లక్షలుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇంత ధర పెట్టి వినియోగదారుడు ఈ కార్లను కొనుగోలు చేస్తారా..? అనేది ప్రశ్న.

టెస్లాకు ప్రధాన పోటీ ఇవే..

మహీంద్రా: 

ఇప్పటికే టెస్లాకు పోటీ ఇచ్చేందుకు టాటా సిద్ధంగా ఉంది. ఇక దేశీయ మరో దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఈవీ మార్కెట్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు చూస్తోంది. ఇప్పటికే మహీంద్రా నుంచి XUV 400 ఈవీ కార్ మార్కెట్‌లో ఉంది. దీని విక్రయాలు కూడా బాగానే ఉన్నాయి. ఇవే కాకుండా మహీంద్రా ఇవెరిటో, ఇ2ఓప్లస్ వంటి మోడళ్లతో మార్కెట్‌లో కీలకంగా ఉంది.

ఎంజీ మోటార్స్:

ఎంజీ మోటార్స్ కూడా ఈవీ మార్కెట్‌ని క్యాప్చర్ చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి MG ZS EV ఉంది. తాజాగా ఎంజీ కామెట్ ఈవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. 2020లో తీసుకువచ్చిన ZS EV సూపర్ సక్సెస్ అయింది.

BYD:

చైనీస్ కార్ మేకర్ BYD ప్రపంచ ఈవీ మార్కెట్లో టెస్లాలో డైరెక్టుగా పోటీ పడుతోంది. టెస్లాతో పోలిస్తే తక్కువ ధరతో, ఎక్కువ రేంజ్, ఎక్కువ టెక్ ఫీచర్లలో BYD కార్లు ఊరిస్తున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి BYD ATTO 3, BYD SEAL కార్లు ఉండగా.. ఇటీవల BYD e6 మోడల్‌ని ప్రవేశపెట్టింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1.85 మిలియన్ కార్లను విక్రయించి టెస్లాను అధిగమించింది. బ్యాటరీ తయారీదారు నుంచి ప్రఖ్యాత ఈవీ కార్ల కంపెనీగా ఎదిగింది.

హ్యుందాయ్ మోటార్స్:

హ్యుందాయ్ కూడా ఈవీ రంగంలో తన ముద్ర వేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి కోనా ఈవీ కార్ మార్కెట్‌లో ఉంది. ఐయోనిక్ 5 వంటి ప్రీమియం ఈవీ కార్‌ని తీసుకువచ్చింది. ఈ నెల ప్రారంభంలో, హ్యుందాయ్ మోటార్ కంపెనీ (హ్యుందాయ్ మోటార్) మరియు కియా కార్పొరేషన్ (కియా) తమ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది.