Hyundai Motor: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుంచి తమ కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కంపెనీకి చెందిన దాదాపు అన్ని మోడల్ కార్లపై సుమారు రూ.25000 వరకు ఈ పెంపు ఉంటుందని చెప్పుకొచ్చింది. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు రూపాయి మారకం విలువ తగ్గిపోవడంతో కార్ల ధరలు పెంచాల్సి వస్తుందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈరోజు (డిసెంబర్ 5) ఓ ప్రకటనలో పేర్కొనింది.
Read Also: Soyam Bapu Rao : బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ
కాగా, ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన వారు కచ్చితంగా.. జనవరి 1, 2025లోపే కొనుగోలు చేస్తే.. రూ.25 వేల వరకు ఆదా చేసిన వారు అవుతారు. లేదంటే, ఆ తర్వాత అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన క్రమంలోనే కార్ల ధరల పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా చెప్పుకొచ్చింది. కంపెనీ ఖర్చుల్లో కొంత భాగాన్ని మాత్రమే కస్టమర్లపై భారం మోపుతున్నట్లు హ్యుందాయ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. కారు మోడల్ బట్టి ధరల పెంపుదల ఉంటుందన్నారు.
Read Also: Technology: ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త టెక్నాలజీ.. పేటెంట్ రైట్స్ కోసం భారీగా దరఖాస్తులు
అయితే, 2025లో మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యే అన్ని కార్లపై ఈ ధరల పెంపు ప్రభావం ఉండబోతుందని తరుణ్ గార్గ్ చెప్పుకొచ్చారు. దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ నుంచి ఐయోనిక్ 5 ఈవీ వరకు అమ్మకాలు చేస్తోంది. బెసిక్ ప్రైస్ రూ. 5.92 లక్షల నుంచి రూ. 46.05 లక్షల వరకు వివిధ మోడల్ కార్లను భారత్ లో అందుబాటులోకి తెచ్చింది. కాగా, ఇప్పటికీ ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కంపెనీల కార్ల ధరలను సైతం పెంచుతున్నట్లు ఆయా కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే మరిన్ని కంపెనీలు సైతం ధరల పెంపు దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉందని సమాచారం.