Hyundai Creta EV: హ్యుందాయ్ తన మోస్ట్ సెల్లింగ్ కార్ క్రెటాని EV అవతార్‌లో తీసుకురాబోతోంది. క్రెటా EVని జనవరి 17న భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయనుంది. క్రెటా EV మార్కెట్‌లో ఉన్న మారుతి సుజుకి eవిటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్, ఎంజీ జెడ్ EV, టయోటా అర్బన్ క్రూయిజర్ EVలకు పోటీ ఇవ్వనుంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా EV టెక్ ఫీచర్లను, సేఫ్టీ ఫీచర్లను వెల్లడించింది.
ఇన్-కార్ పేమెంట్: డ్రైవర్లు నేరుగా కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఈవీ ఛార్జింగ్ కోసం చెల్లింపులు చేయవ్చు. ఇది ఛార్జింగ్ స్టేషన్ల యాక్సెస్‌ని సులభతరం చేసింది.
డిజిటల్ కీ: ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగించి కారుని అన్ లాక్ చేయవచ్చు. స్టార్ చేయడం, కంట్రోల్ చేయడం ఈ ఫీచర్ ద్వారా చేయవచ్చు.
సింగిల్ పెడల్ డ్రైవింగ్: ఈ సిస్టమ్ కేవలం ఒక పెడల్ ఉపయోగించి యాక్సిలరేషన్ పెంచడం, తగ్గించడం చేయడంతో పాటు పూర్తిగా స్టాప్ చేసేందుకు సహకరిస్తుంది.
వెహికిల్-టూ-లోడ్(V2L): క్రెటా ఈవీ కారు లోపల, వెలుపల గాడ్జెట్స్, ఇతర పరికరాలకు ఛార్జింగ్ చేసేందుకు సహకరిస్తుంది.
షిఫ్ట్ బై వైర్(SBW): క్రెటా EV గేర్ నియంత్రణను సులభతరం చేయడానికి, ఎలాంటి అవాంతరాలు లేని డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు ఈ సిస్టమ్‌ని అందిస్తోంది.
ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్‌తో 10.25 అంగుళాల డ్యూయర్ కర్విలినియర్ స్క్రీన్ కలిగి ఉంటుంది.
క్రెటా ఈవీ మొత్తం 75కు పైగా అధునాతన భద్రతా ఫీచర్లతో రానుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు (EPB), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), ISOFIX చైల్డ్ సీట్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్. సిస్టమ్ (TPMS) స్టాండర్గ్‌గా వస్తుంది.
అడాస్ ఫీచర్ల విషయానికి వస్తే..లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో సహా 19 టెక్-ఎనేబుల్డ్ సేఫ్టీ ఫంక్షన్‌లతో క్రెటా EV లెవెల్ 2 ADASని కలిగి ఉంటుంది. బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి ఫీచర్‌లు కలిగి ఉంది. క్రెటా ఈవీ బిల్ట్ క్వాలిటీ విషయాని వస్తే, హాట్ స్టాంపింగ్‌తో బలోపేతం చేయబడిన అధునాతన హై-స్ట్రెంగ్త్ స్టీల్‌ని వాడారు.
బ్యాటరీ-రేంజ్:
క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్స్‌ని కలిగి ఉంది. 51.4kWh ప్యాక్, 42kWh ప్యాక్‌లతో 475 కి.మీ, 390 కి.మీ రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ బ్యాటరీ 125 kW శక్తిని, 171 పీఎస్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 42 kWh బ్యాటరీ వేరియంట్ 99 kW (135 PS) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 58 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కారులోని అవసరమైన భాగాలను చల్లబరిచేందుకు మెరుగైన ఏరోడైనమిక్స్, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎయిర్ ఫ్లాప్స్‌తో వస్తోంది. చల్లని వాతావరణ పరిస్థితుల్లో ఛార్జింగ్ తీరును మెరుగుపరచడానికి బ్యాటరీ హీటర్ కూడా ఉంటుంది.