ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. టాటా కంపెనీ రిలీజ్ చేసిన నెక్సాన్ ఈవీ సూపర్ క్లిక్ అయింది. దీంతో పాటు ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా కార్లు కూడా చాలా వరకు అమ్ముడుపోతున్నాయి.
ఇదిలా ఉంటే ఇండియాలో ఈవీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్తగా బీఎండబ్ల్యూ ఐ4 ఈవీ కార్ ను ఇండియాలో లాంచ్ చేసింది. మొత్తం 6 ఈవీ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఎండబ్ల్యూ తాజాగా ఐ4 రూపంలో మూడో కార్ ను లాంఛ్ చేసింది. సెడాన్ విభాగంలో ఈ కార్ ను తీసుకువచ్చింది బీఎండబ్ల్యూ. క్లార్ ఆర్కిటెక్చర్ తో తయారైన ఈ కార్ ప్రారంభ ధర రూ. 69.90 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. లగ్జరీ ఈవీ కార్ల విభాగంలో ఐ 4 ఎంట్రీ లెవల్ కారుగా ఉండబోతోంది.
50 కిలోవాట్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ తో వస్తున్న బీఎండబ్ల్యూ ఐ4ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 590 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇవ్వనుంది. కేవలం 205 కిలోవాట్ ఛార్జర్ తో కేవలం 31 నిమిషాల్లోనే 10-80 శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఐ4 కారే ఇండియాలో అత్యధిక రేంజ్ ఇచ్చే కారుగా ఉంది. 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ తో 8.25 గంటల్లో కార పూర్తిగా ఛార్జ్ అవుతుంది.