NTV Telugu Site icon

Vijaya Sai Reddy: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రికి సూటి ప్రశ్న.. కార్పొరేట్ కంపెనీల టాక్స్ ఎగవేతపై చర్యలేవి?

Vijayasaireddy

Vijayasaireddy

Vijaya Sai Reddy: రాజ్యసభలో మంగళవారం నాడు కీలక చర్చ నడించింది. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నందున దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), ఆదాయ పన్ను శాఖ, జీఎస్టీ వంటి సంస్థలు కస్టమ్స్‌ సుంకాన్ని ఎగవేసిన పలు మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయని.. కార్పొరేట్ కంపెనీలు టాక్స్‌లు, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

Read Also: Atchannaidu: వైసీపీ అరాచకాలు చూసి చంద్రబాబే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

అలాగే కార్పొరేట్‌ కంపెనీలు ఎగవేసిన పన్నుల మొత్తం ఏమేరకు ఉన్నాయో ప్రభుత్వం మదింపు చేసిందా అని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పన్నులు ఎగవేసిన తర్వాత నోటీసులు జారీ చేయడం కంటే కార్పొరేట్ సంస్థలు నిర్ణీత సమయంలో సుంకాలు, పన్నులను తప్పనిసరిగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జవాబిస్తూ విజయసాయిరెడ్డి చేసిన సూచనతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. పన్నుల ఎగవేతకు సంబంధించి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా అంగీకరిస్తూనే.. కార్పొరేట్‌ కంపెనీల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత ఏ మేరకు ఉందో ప్రభుత్వం మదింపు చేయలేదని నిర్మలా సీతారామన్ వివరించారు.