NTV Telugu Site icon

AP 3 Capitals: మూడు రాజధానులపై నిర్ణయం.. ఎక్కడ ఉండాలో మా ఇష్టం..!

Ap 3 Capitals

Ap 3 Capitals

AP 3 Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం.. అసలు రాజధానులు ఎక్కడ పెట్టాలనేది రాష్ట్రాల ఇష్టం అని తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీలో మూడు రాజధానులని స్పష్టం చేసిన ఆయన.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది మా ధ్యేయం అన్నారు.. రాజధాని నిర్ణయించే అధికారం లేదని చెప్పిన హైకోర్టు.. ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని విమర్శించారు. రాజధాని నిర్ణయించే అధికారం ప్రభుత్వానిదేనని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని పార్లమెంట్లో స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

Read Also: AP Special Status: ఏపీకి అన్యాయం చేశారు.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన వైసీపీ

ఇక, కేంద్ర ప్రభుత్వం, న్యాయ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని హరించే అధికారం లేదన్నారు సాయిరెడ్డి.. రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించి అంశం.. రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయన్న ఆయన.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయించుకుంది.. రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో మేం నిర్ణయించుకుంటాం అన్నారు.. ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రాజధాని ఓ చోట.. హైకోర్టు మరోచోట ఉందనే విషయాన్ని ప్రస్తావించిన విజయసాయి రెడ్డి.. ఉత్తరప్రదేశ్ లో లక్నోలో సెక్రటేరియట్ ఉంటే అలహాబాద్ హైకోర్టు ఉందని.. దీని ప్రకారం అక్కడ ఇప్పటికే రెండు రాజధానులు అమల్లో ఉన్నాయన్నారు.. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ విషయంలో వివక్ష చూపిస్తున్నారు.. ఏపీపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.. వైజాగ్ మెట్రోకు కేంద్రం నిధులివ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి.

Show comments