NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: అది అంత వరకే..! పవన్‌ కల్యాణ్‌తో టచ్‌లో లేను..

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి దగ్గరగా ఉండే ఆయన.. వైఎస్‌ జగన్‌ ఫస్ట్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.. జగన్‌ కేబినెట్‌ 2లో ఆయనకు చోటు దక్కలేదు.. దీంతో, ఆయన అలకబూనడం.. అధిష్టానం బుజ్జగించడం అన్నీ జరిగాయి.. ఇక, ఆ తర్వాత.. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జనసేనానితో బాలినేని టచ్‌లోకి వెళ్లారా? జనసేనలో చేరతారా? అనే అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేశారు.. అయితే, ప్రచారంపై స్పందించిన బాలినేని.. నేను జనసేన నేతలతో టచ్ లో ఉన్నానని ప్రచారం చేయడం సరికాదన్నారు.. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన రాజకీయ బిక్షతో ఎమ్మెల్యేని అయ్యాను.. గతంలో నా మంత్రి పదవిని వదులుకుని మరి జగన్ వెంట నడిచా.. ఊసరవెల్లి రాజకీయాలు చేయాల్సిన పని నాకు లేదని.. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు బాలినేని.

Read Also: KTR Tweets: ఇంకా ఎంతమంది మిగిలారు..?

రాజకీయాల్లో ఉంటే వైసీపీలో ఉంటా.. లేకుంటే రాజకీయాలు మానేస్తానని ప్రకటించారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. అయితే, పవన్ కల్యాణ్‌ చేనేతకు సంబంధించి నన్ను టాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయ్యా.. కేటీఆర్, పవన్ కల్యాణ్‌ కూడా ట్వీట్ చేశారు.. దాన్ని మాత్రం హైలెట్ చేయరు అని మండిపడ్డారు.. గిద్దలూరు వైసీపీ కార్యకర్తలతో నిన్న రోజంతా సమావేశంలో ఉన్నా తప్ప ఎవరిని కలవ లేదన్నారు.. అనవసరమైన రాగ్దాంతం చేస్తూ సంబంధం లేకుండా నన్ను మధ్యకు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. వైసీపీ కార్యకర్తల కోసం ఎంత వరకైనా పోరాడతా.. కొందరు కావాలని నన్ను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఎంతో సమన్వయంతో ఉంటున్నా.. కొందరు ప్రత్యర్థులు నాపైకి కొందరికి ఫండింగ్ చేస్తూ ఉసి గొల్పుతున్నారని ఆరోపించారు. ఇక, గోరంట్ల మాధవ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతోంది.. తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారన్నారు.. ఇక, మార్ఫింగ్ చేశారని తేలితే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.

కాగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. చేనేత వస్త్రాలు ధరించి ఆ ఫోటోలు పోస్ట్ చేయాలని సూచించారు. కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్.. మరో ముగ్గురిని అందులోనామినేట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని కూడా నామినేట్ చేశారు పవన్. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు. వైసీపీలో కీలక నేతగా ఉన్నారు.. ఆయనను పవన్ తన చేనేత ఛాలెంజ్ కు నామినేట్ చేయడం చర్చగా మారింది. దీంతో, ఆయన జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో టచ్‌లోకి వెళ్లారని.. జనసేనలో చేరతారని.. ఇలా రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఆ ప్రచారంపై ఘాటుగానే బదులిచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.

Show comments