వైసీపీ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డిని ఇటీవల సీఎం జగన్ నియమించగా.. అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ సభ్యత్వ నమోదులో ప్రతిఫలించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు.
తెలుగువారు ఎక్కడ నివసిస్తున్నా వారి వివరాలన్నీ ఏపీఎన్‌ఆర్‌టీఎస్ వద్ద ఉండేలా చూడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వైసీపీ తిరుగులేని శక్తిగా రూపొందిందన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ప్రతి కార్యకర్త సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
