NTV Telugu Site icon

YSRCP: పవన్‌ జీవితంలోనూ నటిస్తున్నారు.. సినిమా డైలాగ్స్‌ ఇక్కడ పనికిరావు..

Pawan Kalyan On Volunteers

Pawan Kalyan On Volunteers

YSRCP: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతూనే ఉంది.. వారాహి విజయయాత్రలో అధికార పార్టీ, సీఎం వైఎస్‌ జగన్‌, ఇతర నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వచ్చారు పవన్‌.. వాటికి అదే స్థాయిలో అధికాపరక్షం నుంచి కౌంటర్లు పడుతున్నాయి.. ఈ రోజుల నంద్యాలలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు.. పవన్‌ కల్యాణ్‌తో పాటు టీడీపీ చీఫ్‌ చంద్రబాబుపై కూడా విరుచుకుపడ్డారు.. పవన్ కల్యాణ్‌.. సినిమాల్లో లాగే నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని ఆరోపించారు ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సెక్స్ రాకెట్, కాల్ మనీల గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు.. ఎందుకోసం మాట్లాడరు అని నిలదీశారు.

ఇక, వాలంటీర్ల గురించి పవన్ కల్యాణ్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు, క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. సినిమాల్లో చెప్పే డైలాగ్‌లు నిజజీవితంలో పనికిరావని అని పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాలని హితవుపలికారు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. మరోవైపు.. 2009లో వైఎస్‌ జగన్, పవన్ కల్యాణ్‌.. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు.. అయితే, పవన్ రెండు పార్టీలు మారారు, రెండు చోట్ల ఓడిపోయారు.. కానీ, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు ఎమ్మెల్యే శిల్పా రవి.

కాగా, జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌, రెండు చెంపలు వాయించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.. మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారం అయ్యింది.. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి సీఐ అంజూయాదవ్‌కు నోటీసులు జారీ చేసింది.. ఇక, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి పడితే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు తిరుపతికి వెళ్లారు.. సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.