మంత్రి పదవులు దక్కలేదని అలకబూనిన నేతలంతా దారికొస్తున్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం.. అధినేతకు విధేయులుగా ఉంటామని ప్రకటిస్తున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కూడా అలక వీడారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథి, కాపు రాచమంద్రారెడ్డి అసంతృప్తికి గురయిన సంగతి తెలిసిందే.
మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల బుజ్జగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలకబూనిన ఒక్కో నేత… అధినేత దారిలోకి వస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పార్థసారథి, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్‌తో భేటీ అనంతరం అసంతృప్తిని వీడారు. ఇదే లిస్ట్‌లో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా చేరారు.
Read Also: Nara Lokesh: పవర్ హాలిడే ఎత్తేయాలని జగన్ కి లేఖ
మంత్రి పదవి దక్కకలేదన్న అసంతృప్తితో సుచరిత ఏకంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. వెనక్కి తగ్గేందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు సుచరిత. రెండేళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తామని చెప్పి.. 11 మందిని కొనసాగించడంతో మనస్తాపం చెందినట్టు సీఎం వివరించినట్టు తెలుస్తోంది. త్వరలో నామినేట్ పోస్టుల్లో మంచి హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ప్రకటించారు సుచరిత. ఎట్టకేలకు సుచరిత కూడా అలక వీడడంతో.. వైసీపీలో మంత్రి పదవుల అసంతృప్తి పూర్తిగా చల్లారినట్టైంది.
