ఏపీలో కొత్త జిల్లాల అంశం వైసీపీ నేతల మధ్య చిచ్చుపెడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. తాజాగా జరిగిన ఘటన ఈ టాక్ నిజమే అనిపించేలా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొన్నారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అసమర్ధుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏపీలో ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది.
