NTV Telugu Site icon

YS Viveka Murder Case: రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం.. విజయవాడ, తిరుపతి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు

Ranganna Re Postmortem

Ranganna Re Postmortem

YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులు వరుసుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు.. వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా పనిచేసే రంగన్న వివేకా హత్య కేసులు ప్రధాన సాక్షి అన్నారు. అయితే, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సిట్ బృందంలో ఇద్దరు డీఎస్పీలతో పాటు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, పదిమంది కానిస్టేబుల్స్ ఉంటారని ఆయన వివరించారు.. రంగన్న మృతిని హై ప్రొఫైల్ మర్డర్ గా ఆయన పేర్కొన్నారు. మరింత లోతుగా విచారణ చేపట్టడం కోసం సిట్ బృందం ఆధ్వర్యంలో నిపుణుల చేత రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించాలని నిర్ణయించారు. శనివారం కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు.

Read Also: Pakistan: కుల్‌భూషన్ జాదవ్ కిడ్నాప్‌కి సాయం చేసిన ఉగ్రవాది హతం.. పాక్‌లో ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి మరోసారి వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహించారు. మూడు రోజుల క్రితం రంగన్న చికిత్స పొందుతూ అనారోగ్యంతో కడప రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి రిమ్స్ లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.. ఆ తర్వాత బంధువులు పులివెందుల బాకరాపురం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, రంగన్న భార్య సుశీలమ్మ చేసిన ఆరోపణపైన సందేహాల నివృత్తి కోసం పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు. మృతదేహం నుంచి తల వెంట్రుకలు, కాలిగోళ్లు, చేతి గోళ్లు మరికొన్ని అవయవాలు సేకరించారు. మృతదేహం నుంచి సేకరించిన అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. పోస్టుమార్టం నిర్వహించే సమయంలో రంగన్న భార్య సుశీలమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఈ పోస్టుమార్టం జరిగే ప్రాంతానికి 300 మీటర్ల దూరం నుంచి ఎవరిని లోపలికి రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించి రంగన్న మృతదేహానికి మరోసారి రీపోస్టుమార్టం నిర్వహించారు…