Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం

Pulivendula Tension

Pulivendula Tension

Pulivendula Tension: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఇళ్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు కలకలం రేపాయి. ఈ ఘటనలతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో 30వ వార్డుకు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన నిరంజన్‌రెడ్డి ఇంటి సమీపంలో రెండు లారీలను దుండగులు దగ్ధం చేశారు.. అలాగే మరో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి అంజనప్ప ఇంటి వద్ద ద్విచక్ర వాహనాన్ని కూడా తగులబెట్టారు.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని వైసీపీ అభ్యర్థులను బెదిరించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ పులివెందులలో వరుసగా వాహనాలు దగ్ధం కావడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే, ఈ ఘటనలకు పాల్పడిన వారి వివరాలు, ఘటనల వెనుక ఉన్న కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.