Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్‌ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆరా తీశారు. జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముంతల రామాంజులు గుండెపోటుతో మృతి చెందడంపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు పవన్‌. అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించడంతో పాటు, మృతుడు ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విచారణపై మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణ
నాగులగుట్టపల్లి ఘటన విచారణ ప్రక్రియను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారించాలని పవన్ కల్యాణ్‌.. మంత్రికి సూచించారు. విచారణను సమన్వయం చేస్తూ, దాని పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ముంతల రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫున భరోసా కల్పించేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్‌ను పులివెందులకు వెళ్లాలని సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.

జనసైనికుల కోసం పంచాయతీ ఎన్నికల ప్రత్యేక హెల్ప్ డెస్క్
మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్‌ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఎన్నికల సమయంలో ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్‌ ఆదేశించారు. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారు.