Kadapa Controversy: కడప జిల్లాలో ఓ వివాదాస్పద పోస్టర్ రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. కడప డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశాన్ని ప్రస్తావిస్తూ రూపొందించిన ఓ పోస్టర్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ పోస్టర్లో వెంకటేశ్వర స్వామి చిత్రంలో టీడీపీ నేత వాసు ముఖచిత్రాన్ని ఉంచడం విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవి భర్త శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి ఈ పోస్టర్ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యకర్త బొమ్మిశెట్టి చంద్ర ఈ వివాదాస్పద ఫొటోను రూపొందించారట.. కడపలో డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టర్ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దేవుడి చిత్రంలో రాజకీయ నాయకుడి ముఖచిత్రాన్ని ఉంచడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకేనా?
రాజకీయ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు ఇలాంటి పోస్టర్లు రూపొందిస్తున్నారని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తి భావాలతో పూజించే వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని వారు అంటున్నారు. రాజకీయ అంశాలను దేవుడి చిత్రాలతో ముడిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. శ్రీ వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా ఇలాంటి పోస్టర్లు రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవుడి చిత్రాలను రాజకీయ ప్రచారానికి ఉపయోగించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ పోస్టర్ ప్రస్తుతం కడపలో వైరల్గా మారింది. డిప్యూటీ మేయర్ పదవి చుట్టూ సాగుతున్న రాజకీయ చర్చకు ఈ పోస్టర్ మరింత ఆజ్యం పోసినట్లయింది. ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగా, మరోవైపు భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై సంబంధిత నేతలు, అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

