Andhra Pradesh: ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుండగా.. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.18,750 జమ చేస్తోంది.
అటు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. విశాఖ జిల్లాలో 96,250 ఇళ్లు, అనకాపల్లిలో 3,750 ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21.3 లక్షల మంది గృహనిర్మాణదారులకు ఇళ్లు మంజూరు చేసే పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పలు చట్ట సవరణలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామక ప్రక్రియలో ఎన్‌ఈటీ కచ్చితంగా పాస్ అవ్వాలని సీఎం జగన్ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్ సమావేశంలో మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను జగన్ పరిష్కరించడంతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి.