గుంటూరు జిల్లాలో ఓ మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దారుణంగా దాడి చేసిన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అమానుష ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా (‘ఎక్స్’) స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ దారుణం కేవలం మానవత్వానికే మచ్చ కాదని, రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన శాంతిభద్రతలకు నిలువెత్తు నిదర్శనమని దుయ్యబట్టారు. ఇటువంటి ఘోరమైన ఘటన జరిగినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేశారు.
మూడు రోజులు కప్పిపెట్టి.. ఇప్పుడు నాటకాలా?
ఈ ఘటన బుధవారం జరిగితే, ప్రభుత్వం మూడు రోజుల పాటు బయటకు రాకుండా కప్పిపుచ్చిందని జగన్ ఆరోపించారు. చివరకు ఆ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. “వీడియోలు బయటకు వచ్చాక తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హడావుడి చేయడం సిగ్గుచేటు. ఆ వీడియోలను దాచడంపై పెట్టిన శ్రద్ధను.. తొలిసారి దాడి జరిగినప్పుడే, బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించినప్పుడు పెట్టి ఉంటే ఇంతటి ఘోరం జరిగేది కాదు కదా?” అని ప్రశ్నించారు. బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకోకుండా, స్టేషన్లలో పంచాయితీలు చేయడానికి ప్రయత్నించడం ఏ రకమైన పోలీసింగ్ అని నిలదీశారు. వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు విలువ లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో జంగిల్ రాజ్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. “ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై దాడులను చంద్రబాబు ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను ఒక రాజకీయ ఆయుధంగా మార్చేసింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా మార్చి, ప్రతిపక్షాలు, బాధితులపై అక్రమ కేసులు పెట్టడానికి వాడుకుంటూ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ (అడవి చట్టం) గా మార్చారు” అని మండిపడ్డారు.
టీడీపీ నేతలు దుశ్శాసనుల్లా తయారయ్యారు
అధికార పార్టీ నాయకులు ఏం చేసినా పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ పాలనలో గ్రామాలు, వార్డుల స్థాయి వరకు పాకిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని విమర్శించారు. మహిళలపై ఎలాంటి దారుణాలు చేసినా, అవమానించినా తమను కాపాడటానికి చంద్రబాబు ఉన్నారనే ధైర్యం వారిలో పెరిగిపోవడం వల్లే ఇవాళ రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికార పార్టీ నేతల దురాగతాల నుంచి మహిళలు తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. “చంద్రబాబు గారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన?” అంటూ ప్రశ్నించిన వైఎస్ జగన్, మహిళల ఆగ్రహమే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

