ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడలోని గొల్లప్రోలులో వైయస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాకినాడ పర్యటనకు సీఎం వైయస్ జగన్ బయల్దేరతారు. 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభా ప్రాంగణం నుంచి అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వైయస్ఆర్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు గొల్లప్రోలు నుంచి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకుంటారు.
-
ఏలేరు రెండు ఫేజ్ ల కోసం 300 కోట్లు
ఏలేరు పథకానికి ఫేజ్ 1 కింద 150 కోట్ల రూపాయలు, రెండవ ఫేజ్ కింద 150 కోట్లు కేటాయిస్తున్నాం అన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు మునిసిపాలిటీలకు 20 కోట్ల చొప్పున కేటాయిస్తున్నాం. ప్రతి మునిసిపాలిటీకి శాంక్షన్ చేస్తున్నా అన్నారు.అనంతరం కాపునేస్తం డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి 15 వేల రూపాయల చొప్పన నిధులు విడుదల చేశారు సీఎం జగన్.
-
అప్పుడెందుకు అమలు చేయలేదు
ఇంతమందికి అన్ని పథకాలు అందుతున్నాయి. బటన్ నొక్కితే పథకాలు మీ దగ్గరకు వస్తున్నాయి. కానీ గతంలో డీపీటీ అమలయ్యేది. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ కాళ్లమీద తాము నిలబడాలని భావిస్తున్నాను. హుదూద్ వచ్చినప్పుడు సాయం చేశానని చెబుతున్నారు చంద్రబాబు. నేను కూడా అక్కడే తిరిగాను. అక్కడ ఇచ్చింది పది కేజీల రేషన్ బియ్యం, పాచిపోయిన పులిహోర ఇచ్చారంతే.. వరద పీడిత బాధితులకు 25 కేజీల బియ్యం, ప్రతి ఇంటికి 2 వేలు ఇచ్చాం. ఒక్కరంటూ ఒకరిని చూపించలేకపోతున్నారు. వాళ్లు ఏ అబద్ధాలు చెప్పినా నమ్మేస్తారు. వారికి లేనిది నాకు మాత్రమే మీ ఆశీస్సులు వున్నాయి.
-
DBT కావాలా? DPT కావాలో ఆలోచించండి
మన పాలన మాదిరిగా డీబీటీ కావాలా? చంద్రబాబు హయాంలోలాగా దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కావాలో ఆలోచించండి. మా ప్రభుత్వంలో మంచి జరిగితేనే దీవించండి. నిజాయితీతో కూడిన రాజకీయాలు కావాలా? మోసం, వెన్నుపోటు, అబద్ధాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలా? అని ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఇంట చర్చ జరగాలి. ఏ కులం వారికైనా, మనిషి మనిషికి మేలు చేస్తున్న పాలన గురించి మీరంతా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి.
-
ఎంతమంది అర్హులుంటే..
ఎంతమందికి అర్హత వుంటే వారికి మంచి జరుగుతూ వుంది. కులం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, ఏ పార్టీ అని కూడా చూడడం లేదు. అర్హత వున్నవారికి వివక్ష లేకుండా ముందుకెళుతున్నాం. సోషల్ ఆడిట్ ద్వారా పథకం అందిస్తున్నాం. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా డీబీటీ ద్వారా డబ్బులు పడుతున్నాయి. గతంలో ఏం జరిగిందో గమనించండి. ఆ ప్రభుత్వంలో DPT అమలయ్యేది. అంటే దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీం ద్వారా పథకాలు అమలయ్యేవి. తన దుష్ట చతుష్టయం ద్వారా పాలన సాగించారు. వీళ్లంతా కుమ్మక్కు ద్వారా రాష్ట్రాన్ని దోచుకున్నారు. వీరికి తెలిసింది DPT.
-
అనేక అబద్ధాలు, మోసాల చంద్రబాబు
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అనేక అబద్ధాలు, మోసాలతో ఆ పెద్దమనిషి పాలించాడు.ఇప్పుడు మన ప్రభుత్వం పేదవాడి మీద, అక్కచెల్లెళ్ళ మీద చూపుతున్న చిత్తశుద్ది, శ్రద్ద అన్నారు జగన్. తమ ప్రభుత్వం ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నాం.కాపు నేస్తమే కాదు కాపుకాస్తామని నిరూపించాం. గతంలో ఒక కులానికి, సామాజిక వర్గానికి గత ప్రభుత్వం చేసిన మేలు ఏదైనా వుందంటే.. లెక్కలు మాత్రం బడ్జెట్లో చూపించేవారు. బడ్జెట్లో చూపించిన దానివల్ల కులంలో వున్న మాకు ఎందుకు లబ్ధి చేకూరడం లేదు. గతానికి భిన్నంగా వున్నాం. అందరికీ మేలు జరుగుతోంది. మూడేళ్ళ పాలనలో ప్రతి కుటుంబానికి వెళ్లి పూర్తి వివరాలతో వారికి వివరించగలుగుతున్నాం. తలుపు తట్టి వారి ఆశీర్వాదాలు పలుకుతున్నాం. ఇంత పారదర్శకంగా పాలన సాగిస్తున్నాం. ఈమంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నారు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా వుందా? అని ఆలోచించండి.
-
మూడేళ్ళలో రూ.1492 కోట్లు ఖర్చు
వైఎస్ ఆర్ కాపునేస్తం ద్వారా 1492 కోట్ల రూపాయలు ఇచ్చాం. నవరత్నాల్లోని పథకాల ద్వారా ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలకు కలిగిన లబ్ధి... రూ,.16,256 కోట్లు అని తెలియచేస్తున్నాం. ఇతర పథకాల ద్వారా లబ్ది 16 వేల కోట్లు అన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా గమనించండి. ఇళ్ళు, ఇళ్ళ పట్టాల 2లక్షల 46 వేల మందికి 12 వేల కోట్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. లక్షా 20 వేలమందికి ఇళ్ళు కట్టడం ప్రారంభం అయింది. 15 వేల 334 కోట్లు ఇళ్ళు కట్టడానికి ఖర్చుచేస్తున్నాం. నాన్ డీబీటీ కింద లెక్కలేసుకుంటే.. 16వేలకు పైగా అవుతుంది.
-
మేనిఫెస్టోలో లేకపోయినా.. కాపునేస్తం
మేనిఫెస్టోలో లేకపోయినా మూడవ ఏడాదికి సంబంధించిన కాపునేస్తం డబ్బులు 15 వేల రూపాయలు విడుదల చేశాం. ప్రతి అక్క, చెల్లెలు ఇప్పటివరకూ 45 వేల రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది. వారికి తోడుగా వుంటూ.. క్రమం తప్పకుండా ఈ నిధులు విడుదల చేస్తున్నాం. అర్హత వుంటే ఎవరూ మిస్ కాకూడదు. తపన, తాపత్రయంతో ఈపథకం అమలు చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.
-
ప్రారంభోపన్యాసం చేసిన కలెక్టర్
వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత కార్యక్రమంలో.. కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభోత్సవ ఉపన్యాసం ఇచ్చారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా అందడానికి.. పాలనా సౌలభ్యం కోసం కాకినాడ జిల్లా ఏర్పాటు చేసినందుకు ఆమె సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని ఎంపీ వంగా గీత స్పష్టం చేశారు. మహిళల కోసం దిశ చట్టం తీసుకొచ్చారని, లంచాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని వంగా గీత తెలిపారు.
-
వైఎస్ విగ్రహానికి ఘన నివాళి
గొల్లప్రోలు చేరుకున్న సీఎం మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేశారు. స్థానిక నేతలు, అధికారులతో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు సీఎం జగన్.
-
గొల్లప్రోలు చేరుకున్న సీఎం జగన్
గొల్లప్రోలు చేరుకున్న సీఎం జగన్ కాసేపట్లో సభా ప్రాంగణానికి రానున్నారు. అయితే, సభా ప్రాంగణం వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు షో చేయనున్నారు సీఎం జగన్. ఇందుకోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
-
ఏడాదికి 15 వేలు... ఐదేళ్ళలో రూ.75 వేల సాయం
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడు మూడోవిడత సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతోందని కాపు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
కాపు నేస్తం ద్వారా ఎంతమందికి లబ్ధి అంటే..
జగన్ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా వైఎస్సార్ కాపు నేస్తం పథకం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. మూడోవిడత సాయం కాసేపట్లో అందించనున్నారు సీఎం జగన్. శుక్రవారం అందించే రూ.508.18 కోట్లతో కలిపి ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.1,491.93 కోట్ల మేర లబ్ధి కలిగించారు. తద్వారా ఒక్కో పేద కాపు అక్క,చెల్లెమ్మకు ఈ మూడేళ్లలో రూ.45,000 లబ్ధి కలిగింది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపుల బలోపేతం కోసం ఈ ప్రభుత్వం విశేష కృషి చేసింది. సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపులకు ఒక డిప్యూటీ సీఎం సహా, ఏకంగా నాలుగు మంత్రి పదవులు కేటాయించింది. అన్ని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో కాపు వర్గాలకు తగు ప్రాధాన్యత ఇచ్చింది.
-
తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం జగన్
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఇవాళ పర్యటించనున్నారు సీఎం జగన్. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్. కాసేపటి క్రితం తాడేపల్లి నుంచి బయలుదేరారు సీఎం.