YS Jagan: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు హాజరు అయ్యారు. ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో బలంగా లేవనెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని జగన్ సూచించారు.
Read Also: Golla Ramavva: ఈటీవీ విన్’లో “గొల్ల రామవ్వ” స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇక, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు- బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.. ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు.. అప్పులు చేయడంలో యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుంది.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని మాజీ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
Read Also: Deepinder Goyal: వేల కోట్ల సామ్రాజ్యాన్ని వదిలేసిన దీపిందర్ గోయల్! రాజీనామాకు రీజన్ ఇదేనా?
అయితే, టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని జగన్ ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి.. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారు.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నా.. ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను కలసి సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం అందజేయాలని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలి అని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చెయ్యాలి.. పార్లమెంట్‌ను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించాలి.. కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఎంపీలు పనిచేయాలి.. వైసీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తుందని జగన్ వెల్లడించారు.