VijayaSaiReddy: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి నియామకం

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

VijayaSaiReddy: వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరో కీలక పదవి దక్కించుకున్నారు. ర‌వాణా, సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖ‌ల‌పై ఏర్పాటు చేసిన పార్లమెంట‌రీ క‌మిటీకి ఆయ‌న ఛైర్మన్‌గా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు రాజ్యస‌భ ఛైర్మన్ హోదాలో భార‌త ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ మంగ‌ళ‌వారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విష‌యాన్ని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి త‌న సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ క‌మిటీలో ఉప‌రిత‌ల ర‌వాణా, పౌర విమాన‌యానం, నౌకాయానం, ప‌ర్యాట‌కం, సాంస్కృతిక శాఖ‌ల‌కు చెందిన అంశాలు ఉంటాయి.

కాగా పార్లమెంటరీ క‌మిటీకి త‌న‌ను ఛైర్మన్‌గా నియ‌మించిన జగదీప్ ధ‌న్‌క‌డ్‌తో పాటు త‌న‌పై న‌మ్మకం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిల‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా కృత‌జ్ఞత‌లు తెలిపారు. అటు పార్టీ నుంచి త‌న‌ను ఈ ప‌ద‌వికి ఎంపిక చేసిన జ‌గ‌న్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. త‌న‌కు ద‌క్కిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని దేశ పురోభివృద్ధికి కృషి చేస్తాన‌ని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కాగా పార్లమెంటరీ కమిటీలో రాజ్యసభ నుంచి మహ్మద్ నదీముల్ హక్, శ్రీమతి ఫంగనన్ కొన్యక్, లొఖండ్వాల, మానస్ రంజన్ మంగరాజ్, సొనాల్ మాన్‌సింగ్, ఏఏ రహీమ్, సీఎం రమేష్, వినయ్ దిను టెండూల్కర్‌కు సభ్యులుగా చోటు లభించింది.