అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను టీడీపీ నేతలు పూర్తిగా తమ పాదయాత్రగా మార్చేసుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. రైతుల పాదయాత్రను తమకు అనుకూలంగా మార్చుకుని పసుపుమయంగా చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలు పాల్గొనడమే దీనికి నిదర్శనమన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదని.. కేవలం టీడీపీ శ్రేణులను మాత్రమే అడ్డుకున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.
Read Also: శ్రీశైలం వెళ్లే పర్యాటకులకు గమనిక.. బోట్ సర్వీస్ నిలిపివేత
చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం లేకపోవడంతో రైతుల పాదయాత్రలోకి టీడీపీ నేతలు చొరబడి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విమర్శించారు. కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టి ప్రజల్లో అపోహలు నెలకొల్పి శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే టీడీపీ నేతల పనిగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సుధాకర్‌బాబు ఫైర్ అయ్యారు.