కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. నూజివీడు అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతలు గాంధీబొమ్మ సెంటర్‌లో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు సవాళ్లు విసురుకున్నారు. దీంతో అక్కడకు వచ్చిన టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
అయితే ముందు జాగ్రత్తగా నూజివీడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నూజివీడు గాంధీ బొమ్మ సెంటర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. కాగా పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో టీడీపీ నేత ముద్దరబోయిన శుక్రవారం నుంచే అజ్ఞాతంలో ఉన్నారు. అయితే బహిరంగ చర్చకు వస్తానన్న మాటకు కట్టుబడి ఆయన గాంధీ బొమ్మ కూడలి వద్దకు వచ్చారు. దాంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా సవాళ్లు విసిరిన ముద్రబోయిన ఉదయం నుంచి దాక్కున్నారని వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆరోపించారు. పగలు నూజివీడు వచ్చి వాడు దొంగ.. వీడు దొంగ అంటూ రాత్రికి ముద్రబోయిన విజయవాడ వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. తాను నూజివీడు లోకల్ అని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ముద్రబోయిన మళ్లీ అక్కడికే వెళ్తారన్నారు. వైసీపీ గురించి.. తన గురించి మాట్లాడే హక్కు ముద్రబోయినకు లేదన్నారు. ముద్రబోయిన ఒంటరి అని.. ఆయన ఒంటరిగానే అరెస్టయ్యారని కామెంట్ చేశారు. తనను బయటకు వెళ్లనీయకుండా పోలీసులు నిర్బంధించినా వేలాది మంది తన కోసం వచ్చారన్నారు. బూతు పురాణంతో ముద్రబోయిన రెచ్చగొడుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న సంక్షేమాన్ని టీడీపీ కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరిగి చెప్పాలని డిమాండ్ చేశారు.
