వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్ అయ్యాయని గొల్ల బాబూరావు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో హింసావాదిగా మారతానని చేసిన వ్యాఖ్యలపై మీడియాలో నెగిటివ్గా ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అలర్ట్ అయ్యారు. క్లారిటీ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. తన ఆలోచనలకు కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ కార్యకర్తల్లో ఆవేదనను తెలియజేసే ప్రయత్నంలో ఇంతకు ముందు హింసావాదిగా ఉండేవాడినని.. ఇప్పుడు అహింసావాదిగా మరానని చెప్పానే తప్ప మరో విధంగా చెప్పలేదన్నారు. అధిష్టానంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. 2019లో తనకు టిక్కెట్ ఇవ్వొద్దని చాలా మంది చాలా రకాలుగా అధిష్టానానికి చెప్పినప్పటికీ తనకు టిక్కెట్ కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ రుణ పడి ఉంటానని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తనపై కుట్ర పూరిత రాజకీయం జరుగుతున్న మాట వాస్తవమన్నారు. అయితే తాను వారికి, అధిష్టానానికి ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట ఉన్న విధేయుల్లో తాను మొదటి వరుసలో ఉంటానన్నారు.