YSRCP: 2024 ఎన్నికల్లోనూ గెలవాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో పార్టీ పటిష్టతపై హైకమాండ్ దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. పరిశీలకుల జాబితాపై పార్టీ కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఈ జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటాడని తెలుస్తోంది. నియోజకవర్గ నేతలకు, పార్టీకి అనుసంధాన కర్తగా అబ్జర్వర్లు వ్యవహరించనున్నారు. నియోజకవర్గ అంశాలను ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌కు అబ్జర్వర్లు నివేదించనున్నారు. ప్రతిపాదిత అబ్జర్వర్ల జాబితాను పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు సిద్ధం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదంతో తుది జాబితా సిద్ధం కానుంది. వారం, పది రోజుల్లో 175 నియోజకవర్గాల అబ్జర్వర్ల జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.