ఐదేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌లను గత ప్రభుత్వం విస్మరించింది.. పోలవరం, నదుల అనుసంధానం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ పట్టించుకోలేదని విమర్శించారు. సంక్షోభంలో ఉన్న ఏపీ ఆర్థిక వృద్ధి పూర్తిగా కుప్పకూలడాన్ని ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2022-23 వివరంగా తెలియజేస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. వందేళ్ల వ్యవసాయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పంటల సాగు పాతాళానికి పడిపోయింది. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం, ఉత్పత్తులు లేక అప్పుల బాధతో రైతులు ఆత్మాహత్యలు చేసుకున్నారు అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.
Read Also: Fish Viral video: రైలు కాదు.. పట్టాలపై తిరుగుతున్న చేపలు! వీడియో వైరల్
ఇక, వైఎస్ జగన్ రెడ్డి తప్పుడు విధానాలు, ఆక్వా విద్యుత్ రేట్ల పెంపు, అవినీతి వల్ల మత్య్స ఆక్వా రంగం బలైంది టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకారు అని మండిపడ్డారు. వైసీపీ నిర్వహణ లోపంతో ప్రభుత్వ ఆసుపత్రులను నరక కూపాలుగా తయారు చేశారు.. ఆరోగ్యశ్రీని, అనారోగ్య శ్రీగా మార్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, విద్యా, పర్యాటక రంగాలను గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని యనమల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.