NTV Telugu Site icon

Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ.. వాగ్వాదానికి దిగిన మహిళ

Narayana Swamy

Narayana Swamy

Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ తాకింది.. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కార్వేటినగరం పెద్ద దళితవాడలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణస్వామి.. అయితే, కార్వేటి నగరం పెద్ద దళితవాడ గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఓ మహిళ నిలదీసింది.. ఉచిత రేషన్ బియ్యం అన్నారు మాకు ఇంతవరకు వేయలేదన్న ఆ మహిళ.. ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం అందిస్తామన్నారు.. కానీ, మా ఇంటి దగ్గరికి ఏ రోజు రేషన్ బియ్యం వ్యాన్ వచ్చి బియ్యం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.. ఇక, మా వీధిలో త్రాగునీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. మా వీధిలో మురికి కాలువలో మురికి నీరు అస్తవ్యస్తంగా ఉంది.. ఎవరికీ చెప్పినా పట్టించుకునే వారు లేరన్నారు.. ఇలా సమస్యలు చెబుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వామితో హేమలత అనే మహిళ వాగ్వాదానికి దిగింది..

Read Also: Kiccha Sudeep: బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ

అయితే, ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ మహిళ వెనక్కి తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. కాగా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్యటించడం.. తాము అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృద్ధి గురించి చెప్పడం.. మరోసారి పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇతర కార్యక్రమాలతో కొన్ని రోజులు ఈ కార్యక్రమానికి బ్రేక్‌లు పడగా.. మళ్లీ నిర్వహించాలనే ఈ మధ్యే ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే.