NTV Telugu Site icon

Black Sand: రంగు మారుతోన్న సముద్రం.. ఏం జరిగిందబ్బా..?

Rk Beach

Rk Beach

విశాఖ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇక్కడ నీలి సముద్రం అందాలు సుపరి చితం. 35కిలోమీటర్ల తీరంలో బంగారపు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. వాటిని బలంగా తాకే అలలు కనిపిస్తాయి. కానీ, రెండు రోజులుగా ఇక్కడ సముద్రం కొంత మేర రంగు మారింది. నల్లటి ఇసుక మేటలు వేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ మధ్య తీరం నల్లగా మారడం తో సందర్శకులు అందోళనకు గురైయ్యారు.. నల్లటి ఇసుక కొట్టుకుని రావడం వెనుక సముద్ర గర్భంలో ఏదైనా అసాధారణ చర్య సంభవించిందా…? అనే అనుమానం తలెత్తింది. సాధారణంగా ఇలా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి మధ్య నల్లగా మారే స్పాట్లు చాలానే ఉన్నాయి. సీజన్ మారినప్పుడు, సుముద్రంలో బలమైన అలజడి చోటు చేసుకునే సందర్భంలోనూ ఇది తరచూ జరిగే పరిణామామే. ఐతే, అందోళన కలిగించే స్థాయిలో బ్లాక్ శాండ్ డిపాజిట్ అవ్వడం వెనుక కారణాలను ఆంధ్రా యూనివర్శిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం ప్రాథమికంగా విశ్లేషించింది.

Read Also: Munugode bypoll: మునుగోడు సభపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..

సముద్ర వాతావరణంలో సంభవించే మార్పులు అంటే అలల ఉధృతి పెరగడం మొదటికారణంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఈ సీజన్ లో అంటే జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వలన తీరం వద్ద లోతు ఎక్కువగా ఉన్న చోట్ల కోతకు గురవుతుంది. అలాగే డ్రెడ్జింగ్ కారణంగాను ఇసుక కోతకు గురవుతూనే ఉంటుంది. ఇది తీరాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. ఇలా కోతకు గురయ్యే సమయంలో స్పెసిఫిక్ గ్రాఫిటీ ఎక్కువగా ఉన్న ఇసుక ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో ఆ ప్రాంతంలో ఇసుక నల్లగా కనపడుతుంది. వాతావరణంలో హై ఎనర్జీ అంటే అలల ఉధృతి ఎక్కువగా ఉండటం, తీరం వద్ద గాలులు ఉండటం, అటుపోట్లు అధికంగా ఉన్నప్పుడు హైలెవెన్ మినరల్స్ తీరానికి కొట్టుకుని వస్తాయి. ఇవి అక్కడున్న ఇసుకతో చర్య పొందడం వలన ఆ ఇసుక నల్లగా మారతుంది.ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియలో భాగమేనని ఈ సారి అధిక మొత్తంలో నల్లటి ఇసుక డిపాజిట్ కావడంతో ఆందోళన నెలకొంది తప్ప భయపడాల్సినది ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.

తీరంలో బ్లాక్ శాండ్ డిపాజిట్ కు మరో కారణం భార లోహాలు. తూర్పుకనుమలు ఖనిజ నిక్షేపాల కు నిలయం. ఇక్కడ కొండల మీదుగా వచ్చే ప్రవాహాలు వాటితో పాటు హెవీ మినరల్స్ ను మోసుకుని వస్తాయి. తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు ఉన్నా, ఏవైనా ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక ఆయా రంగులను సంతరించుకుంటుంది. శ్రీకాకుళంజిల్లా బారువ తీరంలో ఇసుక ఎప్పుడు నల్లగానే ఉండటం ఒక ఉదాహారణ. తీర ప్రాంతంలోనైతే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఐరన్ ఓర్ తీరంలో ఉండే ఇసుకలోని సిలికాతో చర్య పొంది ఆ ఇసుకకు నల్లని రంగుని ఇస్తుంది. ఇక, ఇల్మనైట్, మోనోజైట్, హెమటైట్ వంటి ఖనిజాలు కూడా ఇదే లక్షణాలు కలిగి ఉంటాయి. ఉత్తరాంధ్ర తీరంలో భార లోహాలు ఉన్నాయనేది పరిశోధనలు నిర్ధారించాయి. బీచ్ మినరల్స్ తవ్వేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు విశాఖ తీరం లో వచ్చి చేరినవి హెవీ మినరల్స్ కాగా ఇవి ఎక్కువ రోజులు కనిపించవు. అలల ఉధృతికి తిరిగి సముద్రంలో కలిసిపోతాయి. ఐతే, ఇంత పెద్ద ఎత్తున మినరల్స్ డిపాజిట్ రావడం వెనుక కారణాలను విశ్లేషిస్తున్నారు.