Minister Atchannaidu: కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మే నెలలో ఈ మొత్తాన్ని ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, నరేంద్ర మోడీ సర్కార్ కేవలం 42 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందిస్తోందని.. వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోని రైతులు, కౌలు రైతులకు కూడా సాయం అందటం లేదని ఆయన వివరించారు. గత ప్రభుత్వం కేవలం రూ.12,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతీ రైతుకూ పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఇక, రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడేలా డ్రిప్ లు, స్ప్రింక్లర్లు, యాంత్రీకరణ కూడా ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పంటల బీమాను కూడా మళ్లీ అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం 1640 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లిపోయింది.. వాటిని తీర్చి మళ్లీ రైతులకు సాయం అందించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని అసెంబ్లీ వేదికగా మంత్రి గుర్తు చేశారు. మూడు సందర్భాల్లో అన్నదాత సుఖీభవ అందుతుందన్నారు.