Vijayawada: పెట్రోల్ బంకులు ఎప్పుడూ వాహనదారులతో రద్దీగా ఉంటాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టడంతో పాటు రద్దీగా ఉన్న సమయంలో బంకుల్లో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తక్కువగా రావడం, రీడింగ్‌లో మోసం, కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనం, ఎక్కువ డబ్బు తీసుకోవడం లాంటి మోసాలు ఇటీవల జరగుతున్నాయి. ఇది కాకుండా మరికొన్ని చోట్ల పెట్రోల్‌కు బదులు నీళ్లు కూడా వస్తున్నాయి. నిజమేనండోయ్.. దీని కారణంగా వాహనాలు కూడా పాడవుతుంటాయి. ఇలాంటి సంఘటనే తాజాగా విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌పెట్రోల్ బంక్ లో వాహనదారులు పెట్రోలు పోసుకొని ఒక కిలోమీటర్ దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోతున్నాయి. ఎందుకు ఇలా జరిగిందో అని వాహనదారులు మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లగా.. పెట్రోల్‌లో నీరు కలిసిందని వారు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.
Read Also: NEET-UG: నీట్-యూజీ పరీక్ష రద్దుపై రేపు సుప్రీం కోర్టులో విచారణ..
పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీళ్ల కలపడం వల్ల వాహనాలు మొరాయించడంతో వాహనదారులు బంకు ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా.. కొంతమంది వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గరికి వాహనాలను తీసుకువచ్చి వారి వాహనాలలో నుండి పెట్రోల్ తీయించి మరి యాజమాన్యానికి చూపించారు. వర్షం నీళ్లు రావడంతో నీళ్లు కలిశాయని.. పొరపాటు జరిగిందని బంక్ యజమాని చెప్పారు. వాహనాల్లో పెట్రోల్ మొత్తం బయటికి తీసి మళ్లీ పెట్రోల్ కొట్టి ఇస్తానని బంక్ యజమాని చెప్పారు. వాహనదారులకు మరమ్మతులు చేసి ఇస్తానని హామీ ఇవ్వడంతో వాహన దారులు ఆందోళన విరమించారు.