ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనంగా మారింది.. కాల్ మనీ మాఫియా వేధింపులు భరించలేక ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ఆయన.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా తీసుకున్నాడు.. అయితే, వడ్డీ డబ్బులు చెల్లిస్తూ వస్తున్నప్పటికీ.. ఇంకా లక్షల్లో అప్పు చూపిస్తోంది కాల్ మనీ మాఫియా..
అంతేకాదు.. గౌస్‌ను తీవ్ర వేధింపులకు కూడా గురిచేసినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. కాల్ మనీ మాఫియా చిత్రహింసలు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ లెటర్ రాసి.. కొండపల్లిలోని తాను నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు గౌస్.. ఈ ఘటనతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయిన ఆ కుటుంబం.. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తోంది.. ఇక, కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కృష్ణా జిల్లాలో కాల్ మనీ మాఫియా ఎన్నో ఆగడాలకు పాల్పడింది.. వడ్డీకి డబ్బులు ఇచ్చి చిత్ర హింసలకు గురిచేసిన ఎన్నో ఘటనలు బయటపడ్డాయి.. చివరకు ఈ మాఫియా మహిళలను లైంగికంగా వేధించిన ఘటనలు కూడా వెలుగుచూసిన విషయం తెలిసిందే.