Andhra Pradesh Volunteers: ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఫించన్ ఇస్తున్నారు. అయితే కొందరు వాలంటీర్స్ అమాయకపు వ్యక్తులను మోసం చేస్తూ బాగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లు చేతి వాటం ప్రదర్శించారు. నూతనంగా మంజూరైన ఫించన్ ఇచ్చినట్టే ఇచ్చి ఫోటోలు దిగి వాలంటీర్లు వెనక్కి తీసుకున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫించన్ రావడంతో బాధితులు కళ్ళల్లో ఆనందంకు అవధులు లేకుండా పోయింది. అయితే ఆ ఆనందం గంటలోపే నీరు కారి పోయింది. ఓ చేత్తో ఇచ్చి.. మరో చేత్తో వాలంటీర్లు ఇచ్చిన డబ్బులను లాక్కొని వెళ్ళారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: MP Gorantla Madhav Live : నేను చెప్పింది చేస్తే రాజీనామా చేస్తా..!
అయితే కోసిగి మండలం కామన్ దొడ్డిలో వాలంటీర్లందరూ కుమ్మక్కై ఓ పాలసీని అమలు చేస్తున్నారు. నూతనంగా మంజూరైన మొదటి నెల ఫించన్‌ను రౌడీ మాములు ఇవ్వాల్సిందేనని వాలంటీర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ పాలసీని సీఎం జగన్ అమలు చేశారా లేదా వాలంటీర్లు అమలు చేశారా అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అక్కడ వాలంటీర్లు తామే సీఎం.. తామే ఎమ్మెల్యే.. తమకు ఎదురు తిరిగితే సంక్షేమ పథకాలు, ఫించన్ అందకుండా తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు వాలంటీర్లు తూట్లు పొడుస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇలాంటి వాలంటీర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
