NTV Telugu Site icon

Vizag Smart Scam Update: విశాఖ స్మార్ట్ యోజన కేసులో సీఐడీ దూకుడు

Smart1 (1)

Smart1 (1)

ఏపీలో సంచలనం కలిగించిన విశాఖ స్మార్ట్ యోజన వెల్ఫేర్ ఘరానా మోసం కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది CID….ఈ కేసుకి సంబంధించి ఇద్దరు కీలక నిందితులను విచారణ కోసం కస్టడీ పిటీషన్ దాఖలు చేసింది సీఐడీ. నేడు కోర్టు నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది. స్మార్ట్ యోజన వెల్ఫర్ సొసైటీ ముసుగులో వందల కోట్లు కొట్టేశారు నిందితులు. ఎండీ సుధాకర్ ను ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారించింది సీఐడీ. భారీ స్కామ్ నిందితుడు సుధాకర్ పేరు మీద ఒక ఇల్లు,10లక్షల బ్యాంక్ బాలెన్స్ మాత్రమే ఉన్నట్టు సమాచారం.

నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసందళారులను పెట్టుకున్నాడు సుధాకర్. 15మందిని గుర్తించి నోటీసులు జారీ చేసింది CID. నిరుద్యోగుల బలహీనతే పెట్టుబడిగా జరిగిన ఘరానా దోపిడీ ఇది. భారీ జీతాలు….ఉన్నతమైన ఉద్యోగాలు పేరుతో వల వేసి చేసిన పక్కా మోసానికి తెరతీశారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అవకతవకల తీగలాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది. ఫర్మ్ పేరులో స్మార్ట్ ఉంచుకుని….రాజకీయ పెద్దలతో పరిచయాలు పెంచుకున్న వ్యక్తి అంతరంగం పసిగట్టలేకపోయారు నిరుద్యోగులు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సీఎండీ ఇండిపూడి సుధాకర్ ను  అనకాపల్లిలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also: Elevator Accident : ఖమ్మంలో దారుణం.. లిఫ్ట్‌ రాకముందే డోర్‌ ఓపెన్‌ చేయడంతో..

అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 2018 అక్టోబర్ లో నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీని స్ధాపించాడు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తమ సంస్ధ పనిచేస్తున్నట్టు ప్రకటించుకున్నాడు సుధాకర్. గ్రామాలు, స్కూళ్లలో సోషల్ వర్క్ చేస్తూ జనానికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిజిల్లాలకు కార్యకలాపాలు విస్తరించాయి. భారీగా ఉద్యోగాల భర్తీ, ఆకర్షణీయమైన జీతాలు ప్రకటించి నిరుద్యోగ యువతకు ఆఫర్ ఇచ్చాడు సుధాకర్. ఇతని మోసాలను విద్యావంతులు కూడా పసిగట్టలేకపోయారు.

స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పుట్టిన నర్సీపట్నంలోనే ఆ సంస్ధ ఎండీ సుధాకర్ పై ఫిర్యాదులు వచ్చాయి. సంస్ధలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, జిల్లా ఏవో పోస్టులు వున్నాయని, నెలకు 15నుంచి 25వేలు జీతంగా చెల్లిస్తామని నమ్మబలికింది. ఇందు కోసం డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి 1.5లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేశాడు. నకిలీ నియామకపత్రాలతో బురిడీ కొట్టించాడు. ఇంతకీ ఈ సుధాకర్ వెనుక వున్నది ఎవరు? అతని అకౌంట్లో పదిలక్షలే వుండడం ఏంటి? వసూలు చేసిన కోట్లు ఎవరి అకౌంట్లలోకి చేరాయి? అసలు ఈ వ్యవహారంలో పెద్ద తలకాయ ఎవరు? ఇప్పుడివే ప్రశ్నలు అందరి మెదళ్ళను తొలిచేస్తున్నాయి.

Read Also: PM Narendra Modi: ప్రధాని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన యూఎస్ఏ, ఫ్రాన్స్.