Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం

  • పోర్టుల నిర్లక్ష్యంతో పెరుగుతున్న బొగ్గు కాలుష్యం
  • శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిన విశాఖ ప్రజలు
  • గ్రీన్ బెల్ట్, SOPల అమలుపై నిపుణుల హెచ్చరిక
  • మూలపేట పోర్ట్‌తో తగ్గనున్న విశాఖపై ఒత్తిడి
Vizag

Vizag

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, పర్యాటక స్వర్గధామం విశాఖపట్నం ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన సముద్రపు గాలితో సేదతీర్చిన ఈ నగరం, నేడు విషతుల్యమైన బొగ్గు పొడితో నిండిపోతోంది. విశాఖ , గంగవరం పోర్టుల కార్యకలాపాలు నగరం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అక్కడి కార్గో హ్యాండిలింగ్ , రవాణాలో జరుగుతున్న ఘోరమైన వైఫల్యాలు స్థానిక ప్రజల జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. ప్రధానంగా ఓపెన్ యార్డ్‌లలో బొగ్గు, ఇనుప ఖనిజాన్ని నిల్వ చేయడం వల్ల గాలి వీచినప్పుడల్లా ఆ దుమ్ము నగరంపైకి వ్యాపిస్తోంది. ఈ ఖనిజాలను లారీల ద్వారా తరలించేటప్పుడు టార్పాలిన్లు కప్పకపోవడం, నిల్వ ఉంచిన గుట్టలపై వాటర్ గన్స్,  స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు చిలకరించకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల గాలిలో కాలుష్య కారకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం కార్గోను మూసి ఉంచాల్సిన చోట, బహిరంగంగా వదిలేయడం వల్ల నగరం నల్లటి పొరతో కప్పబడిపోతోంది.

ఈ కాలుష్యం ప్రభావం నేరుగా ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో స్థానికులు ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రమైన కంటి సమస్యలు , గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇళ్లలోకి నల్లటి బొగ్గు పొడి విపరీతంగా చేరుతోందని, రోజుకు పది సార్లు ఇల్లు తుడుచుకోవాల్సిన పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగవరం గ్రామస్థుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది; తాము పుట్టి పెరిగిన ఊరిలో ఉండలేకపోతున్నామని, ప్రభుత్వం తమకు వేరే చోట పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో వాయు కాలుష్యం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరుకోవడంపై పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టడానికి పోర్టులు , భారీ పరిశ్రమల చుట్టూ కనీసం 100 అడుగుల మేర దట్టమైన చెట్లను పెంచి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్ట్ త్వరగా అందుబాటులోకి వస్తే, విశాఖకు వచ్చే కార్గోలో మెజారిటీ అక్కడికి తరలిపోయే అవకాశం ఉంది, తద్వారా విశాఖపై ఒత్తిడి తగ్గి కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP) ప్రకారం కార్గో హ్యాండిలింగ్ జరిగేలా కాలుష్య నియంత్రణ మండలి కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖను “సిటీ ఆఫ్ డెస్టినీ” అని పిలుచుకుంటాం, కానీ ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంలో విఫలమైతే ఆ పేరు అర్థరహితంగా మారుతుంది. ప్రభుత్వం , పోర్ట్ యాజమాన్యాలు తక్షణమే స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.