తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న నటుడు విశాల్.. ఇక, అతడు తెలుగువాడే కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడనే ప్రచారం సాగుతూ వస్తుంది.. అంతేకాదు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాడనే గుసగుసలు కూడా వినిపించాయి.. అసలు, కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైసీపీ సర్కార్.. సీఎం వైఎస్ జగన్ కూడా కుప్పంలో పర్యటించారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కుప్పంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు.. దీంతో, ఆ నియోజకవర్గాన్ని వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది.. ఇక, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబుపై హీరో విశాల్‌ను బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా సాగుతోన్న సమయంలో.. ఆ ప్రచారంపై హీరో విశాల్ స్పందించారు..
చెన్నైలో ఆదివారం జరిగిన ‘లత్తి’ (తెలుగులో లాఠీ) చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు హీరో విశాల్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. తనకు అక్కడ పోటీ చేసే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. కుప్పం ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ఉన్న సంగతి నిజమే.. కానీ, తాను అక్కడినుంచి పోటీ చేస్తానన్న వార్తల్లో మాత్రం నిజం లేదని కుండబద్దలు కొట్టారు.. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనన్నారు విశాల్.. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీకి దిగుతానన్న ఆయనే.. కుప్పంలో మా నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారని.. ఆ సమయంలో మూడేళ్లపాటు కుప్పంలో ఉన్నాను అని గుర్తుచేసుకున్నారు.. ఇక, పెళ్లి ఎప్పుడంటూ ఎదురైన ప్రశ్నపై స్పందిస్తూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు విశాల్.. మొత్తంగా.. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ పోటీపై క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.