Vangaveeti Asha Kiran: దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై వంగవీటి ఆశా కిరణ్ తీవ్ర స్వరంతో స్పందించారు. విశాఖపట్నం వేదికగా మన రంగానాడు పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ప్రశ్నిస్తూ.. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం ఏం చేశారు..?” అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో రంగా ఫోటోను ప్రచారానికి వాడుకుంటూ ఓట్లు అడుగుతున్న పార్టీలు, ఆ తర్వాత ఆయన పేరును, ఆయన ఆశయాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఎన్నికల్లో రంగా ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.. మరి ఇన్నేళ్లలో ఆయన కోసం చేసిన పని ఏంటి? అంటూ ప్రశ్నించారు.
Read Also: Champion: ఛాంపియన్ సక్సెస్ గొప్ప సాటిస్ఫాక్షన్ ఇచ్చింది: నిర్మాత స్వప్న దత్
వంగవీటి రంగా పేరు మీద జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చారు వంగవీటి ఆశా కిరణ్.. రంగా పేరు జిల్లాకు ఎప్పుడూ పెడతారు..? ప్రజల మనోభావాలను మీరు ఎప్పుడూ గౌరవిస్తారు?” అని ప్రశ్నిస్తూ రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. అభిమానిగా నిలదీస్తా.. వారసత్వం కాదు, రంగా ఆశయమే ముఖ్యం అని స్పష్టం చేశారు.. తాను రంగా కూతురిగా కాకుండా ఒక అభిమానిగా మాట్లాడుతున్నానని, ఇకపై మృదువుగా వ్యవహరించేది లేదని పేర్కొన్నారు.. ఆడపిల్లను సాఫ్ట్‌గా ఉంటాను అనుకోవద్దు.. నాలో ఉన్నది రంగా రక్తమే.. వెనకడుగు వేసేది లేదు, సై అంటూ ముందుకే వెళ్తా అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
ఇక, రంగా అభిమానుల బలాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయనున్నట్లు ప్రకటించారు ఆశా కిరణ్.. ప్రతి గ్రామానికి వెళ్లి రాధా – రంగా మిత్ర మండలిని బలోపేతం చేస్తా.. రంగా ఆశయాల అమలే నా లక్ష్యం అని తెలిపారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సమావేశం నుంచే తనపై, తమ కార్యక్రమాలపై అడ్డంకులు మొదలయ్యాయని పేర్కొన్న ఆమె.. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటాం.. వెనకడుగు వేయడం రంగా కూతురికి అలవాటు లేదు అంటూ ధీమా వ్యక్తం చేశారు. వంగవీటి రంగా ప్రకటించిన 5 ప్రధాన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని ఆమె వెల్లడించారు. దీనిని పార్టీ మానిఫెస్టోగా కాకుండా ఒక ప్రజా ఎజెండా, ప్రజా ఉద్యమ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు వంగవీటి ఆశా కిరణ్.. అయితే, ఆశా కిరణ్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రంగా వారసత్వ రాజకీయాలకంటే, ఆయన ఆశయాల అమలుపై ప్రశ్నిస్తూ ఆమె తీసుకున్న స్టాండ్ రాజకీయ పార్టీల్లో చర్చకు దారి తీస్తోంది.
