Botsa Satyanarayana: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు దిగాయి. ఈ నిరసనలో భాగంగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి నల్ల కండువాలు ధరించి వైసీపీ నేతలు వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబుతో పాటు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: CM Revanth Reddy: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజిబిజీ!
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూ దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో ఉన్న భూ క్రమబద్ధీకరణ అంశాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం.. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
