Site icon NTV Telugu

Vizag Railway Zone: దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..

Vizag Railway Zone

Vizag Railway Zone

Vizag Railway Zone: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ రైల్వేశాఖకు 52 ఎకరాల స్థలం ఉండగా, సుమారు పదెకరాల్లో కొత్త భవనాలు వస్తాయి. 149 కోట్లతో 9 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది రైల్వేశాఖ. వాస్తవానికి దక్షిణ కోస్తా జోన్ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వ హయంలోనే ప్రారంభమైనప్పటికీ భూ కేటాయింపుల్లో జాప్యం జరిగిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముడసర్లోవలో ప్రతిపాదించిన భూములు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాకు దగ్గరగా వుండటం, సాగు చేసుకుంటున్న రైతుల నుంచి అభ్యతరాలు రావడం కారణం.

Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వెండి!

కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత జోన్ భూములపై వున్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చినగదిలి మండలం ముడసర్లోవలో 52.22 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యుటేషన్ ద్వారా రైల్వేశాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వేజోన్ మైల్ స్టోన్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.. రైల్వే జోన్ కోసం భూముల కేటాయింపులో జాప్యం కారణం అవ్వడం పై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత ఏడాది జనవరిలోనే తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని.. అదే భూముల్లో జోనల్ కార్యాలయం నిర్మాణం చేస్తూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ వ్యవహారం పక్కన పెడితే.. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ ప్రస్థానంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రెండో రోజు షెడ్యూల్‌ ఇదే..

వందేళ్ల చరిత్ర కలిగిన విశాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్ తో కూడిన జోన్ ఏర్పాటు అనేది డిమాండ్. విభజన చట్టం 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి జోన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజించి విజయవాడ డివిజన్‌లో విలీనం చేయాలని.. మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలోని రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాయగడ డివిజన్ రూపుదిద్దుకోగా వాల్తేర్ మనుగడ మీద క్లారిటీ లేదు. జోన్, డివిజన్ కొనసాగించడం ద్వారానే ఆశించిన ప్రయోజనాలు సాధ్యం అంటున్నాయి రైల్వే యూనియన్ లు. మొత్తంగా ఎట్టకేలకు రైల్వేజోన్ కల సాకారం అవుతుండగా.. ప్రధాని మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుండటం రాజకీయ వర్గాల ఆసక్తిని రెట్టింపు చేసింది.

Exit mobile version