Rain Alert: రైతులకు గుండెదడ రప్పించిన ‘సెన్యార్’ తుఫాన్ సముద్రంలోనే బలహీన పడి ఈశాన్య ఇండోనేషియా దగ్గర తీరం దాటింది. దీని ప్రభావం మీద అనేక అంచనాలు వుండగా అండమాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించక ముందే గమనాన్ని మార్చుకుంది. తీరం దాటే సమయంలో గాలులు వేగం గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు పుంజుకుంది. వచ్చే రెండురోజులు’సెన్యార్’మరింతగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ముప్పు తప్పినప్పటికీ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సగటున 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతంలో కదులుతూ బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది.
Read Also: డిజిటల్ క్లస్టర్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో Hero Xtreme 160R 4V లాంచ్.. ధర ఎంతంటే..?
ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుండగా వాతావరణ అనుకూలతను బట్టి తుఫాన్ గా రూపాంతరం చెందే అవకాశాలను కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. ఇది., ఉత్తర తమిళనాడు., పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయుగుండ ప్రాంతం నుంచి రెయిన్ బ్యాండ్స్ విస్తృతి ఏపీ అంతటా వుండనుంది. దీని కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి దక్షిణ కోస్తాజిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవన ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని జల్లులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి. వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ గాలుల ఉధృతి, వర్షాల తీవ్రత పెరుగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రైతుల పంటలు నష్టపో కుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలనే సూచనలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఈదురు గాలులు గంటకు 35 -45 కిలో మీటర్లు.. గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగముతో వీచే అవకాశముంది. దక్షిణ కోస్తాంద్ర నుంచి వేటకు వెళ్ళిన మత్స్యకారుల సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరికలు వున్నాయి.